Konda Susmita: కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీ పంచాయతీ ప్రస్తుతం కొరకరానీ కొయ్యలా మారింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ ఎన్. సుమంత్ ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ ఏకంగా తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వేటు వేసింది. తొలగింపు అనంతరం సుమంత్.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి వెళ్లారని పోలీసులకు సమాచారం అందింది. సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు కొందరు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. మంత్రి సురేఖ ఇంటికి వెళ్లగా బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.
కొండా కుమార్తె సంచలన ఆరోపణలు
మాజీ ఓఎస్డీని అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వచ్చిన పోలీసులను.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత లోనికి అనుమతించలేదు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న సురేఖ.. కొద్దిసేపటి తర్వాత సుమంత్ ను తీసుకొని కారులో బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓఎస్డీ ఎపిసోడ్ పై సెల్ఫీ వీడియోలో మాట్లాడిన సుస్మిత.. సంచలన ఆరోపణలు చేశారు. ‘కొండా కుటుంబంపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కడియం శ్రీహరి మాపై కుట్రలు చేస్తున్నారు. వరంగల్ కు చెందిన నేతలంతా ఇందులో భాగస్వాములు. కార్యకర్తలు అధైర్య పడొద్దు. వారిని కాపాడుకునే బాధ్యత కొండా కుటుంబానిది. మాకు పదవులు, పైసలు శాశ్వతం కాదు. మీరు మనో ధైర్యంతో ఉండి.. మాకు మనోధైర్యాన్ని ఇవ్వండి. పోలీసుల ప్రహారిలో ఇంట్లో ఉన్నాను. మేము ఏ తప్పు చేశామో తెలియట్లేదు. ఇంత కక్షగట్టి బీసీ లీడర్లు అయిన మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అంటూ సుస్మిత చెప్పుకొచ్చారు.
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత, సుమంత్ .. కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది #KondaSurekha #Congress pic.twitter.com/FMl1KHnCqf
— Swetcha Daily News (@SwetchaNews) October 16, 2025
కొండా మురళీ రియాక్షన్..
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై కొండా మురళి స్పందించారు. హైదరాబాద్ లోని ఇంటి వద్ద.. సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని అన్నారు. సచివాలయంలోని కొండా సురేఖ కార్యాలయానికి తాను ఒక్కసారి మాత్రమే వెళ్లానని చెప్పారు. మరోవైపు కూతురు వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆమె ఇబ్బంది పడిందని.. అందుకే అలా మాట్లాడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పోలీసులు.. మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకొని తదుపరి అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను వ్యక్తిగతంగా కలిసి అన్ని విషయాలు వివరిస్తానని పేర్కొన్నారు.
జరుగుతున్న పరిణామాలు నాకేం తెలియవు: కొండా మురళి
మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు
రేవంతన్న ముఖ్యమంత్రి కావాలని అనుకున్నవాళ్లలో నేను మొదటివాడిని
– కొండా మురళి pic.twitter.com/JzniSRlPEF— ChotaNews App (@ChotaNewsApp) October 16, 2025
Also Read: Raja Singh: బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో కిషన్ రెడ్డి చెప్పాలి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం సంచలన ఆదేశాలు
అనేక వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలుస్తున్న మంత్రి కొండా సురేఖకు తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఝలక్ ఇచ్చింది. మేడారం జాతర పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యత వహిస్తున్న ఆర్ అండ్ బీ విభాగానికి అప్పగించింది. ఈ మేరకు మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను దేవాదయశాఖ అధికారులు.. ఆర్ అండ్ బీ విభాగానికి అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
