Raja Singh: రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా బీజేపీ జాతీయ పెద్దలు వచ్చినప్పుడల్లా బీసీ ముఖ్యమంత్రి అంటూ చెబుతారని, కానీ చివరకు తెలంగాణలో చిన్న ఎన్నికల నుంచి పెద్ద ఎన్నికల వరకు అన్నిట్లో బీసీలనే మరిచిపోతారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీలో బీసీల స్థానం, పార్టీలో బీసీలు ఎక్కడున్నారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని రాజాసింగ్ (Raja Singh) ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఇంతకుముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదన్నారు. తాను హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతానని, కానీ తాను ఈ అంశంపై మాట్లాడటానికి కారణం కిషన్ రెడ్డి అంటూ పేర్కొన్నారు.
Also Read: MLA Raja Singh: కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాజాసింగ్.. బీజేపీ మీవల్లే నాశనమైదంటూ..
బీసీ సమాజాన్ని మోసం
ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారన్నారు. అందుకే తాను ఈ అంశాన్ని చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు లంకల దీపక్ రెడ్డికి రాజాసింగ్ అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులంతా తమ పేరే వస్తుందని భావించారని, కానీ అలా జరగలేదని వివరించారు. పేరుకు హైకమాండ్ ప్రకటన చేసినా దీని వెనక ప్రధాన పాత్ర కిషన్ రెడ్డిదేనని రాజాసింగ్ పేర్కొన్నారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. కిషన్ రెడ్డి రాజ్యం.. కిషన్ రెడ్డి రాజ్యం అంటూ ఆయన ఎద్దేవాచేశారు.
ఆత్మ పరిశీలన చేసుకోవాలి
మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం మన మధ్య లేరని, ఆయన భార్య ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు. గోపీనాథ్ మనతో లేకపోయినా కొంతమంది నీచమైన రాజకీయ నాయకులు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది తప్పని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతా ఏదో ఒకరోజు చనిపోయేవాళ్లమేనని, ఎవరైనా రాజకీయ నేత చనిపోతే, ఆయన భార్య, కూతురు లేదా కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తే వారి గురించి చెడుగా మాట్లాడితే ఎలా ఉంటుందనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజాసింగ్ ప్రశ్నించారు.
Also Read: Raja Singh: నా రాజీనామా ఆమోదానికి ఆ నలుగురే కారణం
