Lightning Strikes: రాగల ఐదు రోజుల పాటు ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు పిడుగులు (Lightning Strikes) పడే అవకాశం ఉందంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిందే నిజమైంది. గుంటూరు జిల్లాలో బుధవారం తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. బతుకుదెరువు కోసం కూలీ పనులకు వెళ్లిన ఇద్దరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాడు. మరో మహిళ తీవ్ర గాయాలపాలవ్వగా, ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఇటికంపాడు గ్రామ శివారులో ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన ఇద్దరు మహిళలను మరియమ్మ, షేక్ ముజాహిదగా గుర్తించారు. వారిద్దరూ 45 ఏళ్ల వయసు కలిగినవారే.
వరి పొలంలో పనిచేస్తుండగా..
గురువారం మహిళలందరూ వరిపొలంలో పనిచేస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వర్షం కురుస్తుండగానే వారంతా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పిడుగుపాటుకు పొలంలోనే పడిపోయారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మహిళలు చనిపోయారు. గాయపడిన మహిళల పేరు మాణిక్కమ్మ అని తెలుస్తోంది. ఈ విషాదకర ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
పొలం పనుల్లో ఈ జాగ్రత్తలుముఖ్యం
వర్షాలకు కురిసే సమయంలో పొలాల్లో పనిచేసుకునే రైతులు, కూలీలు పిడుగుపాటుకు గురయ్యే ముప్పు ఎక్కువగా పొంచి ఉంటుంది. అయితే, పిడుగుల బారినపడకుండా ఉండడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, లేదా ఆకాశంలో ఉరుము శబ్దం వినపడగానే వెంటనే పొలం పనులు ఆపివేయాలి. దగ్గరలోని క్షేమమైన ఇళ్లు, లేదా షెడ్డుల్లో ఆశ్రయం పొందాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండకూదు. పొలాల్లో, లేదా బహిరంగ ప్రదేశాల్లో పొడవాటి చెట్లు, లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉంటే ప్రమాదం పొంచివున్నట్టే. పిడుగులు ఎత్తైన వస్తువులనే ఎక్కువగా తాకుతుంటాయి. అలాగే, ట్రాక్టర్లు, నాగళ్లు, గొడ్డలి వంటి లోహపు వస్తువులకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాలువలు, చెరువులకు కూడా దూరంగా ఉండడం ఉత్తమమని సూచిస్తున్నారు.
పొలం పనులు చేసుకునే ప్రదేశంలో ఆశ్రయం ఏదీ దొరక్కపోతే, ఉన్నప్రదేశంలోనే వీలైనంత తక్కువ ఎత్తులో, మోకాళ్లపై కూర్చొని తల దాచుకోవాలని సూచించారు. నేలపై బోర్లా పడుకోవడం అంత సురక్షితం కాదని, ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రాణాపాయాన్ని కొంతమేర నివారించవచ్చని పేర్కొంటున్నారు.
Read Also- China CR450 Train: వరల్డ్ రైల్వే టెక్నాలజీలో చైనా సంచలనం.. ఊహించని వేగంతో ట్రైన్
ఏపీలో విస్తారంగా వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతోందని, వచ్చే 12 గంటల్లో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వివరించింది. ఈ ప్రభావంతో తిరుపతి, కడప, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీచేసింది. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని పాఠశాలలకు గురువారం (అక్టోబర్ 23) సెలవు దినంగా ప్రకటన చేశారు.
