Janasena X Account: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సారధ్యంలోని జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అందించే ‘ఎక్స్’ అకౌంట్ (ట్విటర్) హ్యాకింగ్‌కు గురైనట్టుగా కనిపిస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో అసాధారణ యాక్టివిటీస్ కనిపించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఆ అకౌంట్‌లో ఆదివారం ఉదయం పలుపోస్టులు చూసి జనసైనికులతో పాటు అకౌంట్‌ను లక్షలాది సంఖ్యలో ఫాలో అయ్యేవారు ఆశ్చర్యపోయారు. లోగో మాయమైపోయింది. అంతేకాదు, బ్యానర్ ఫొటో కూడా ఎగిరిపోయింది. పైగా, ఎప్పుడూ పార్టీ, ప్రభుత్వ సంబంధ కార్యక్రమాల పోస్టుల స్థానంలో, ఎప్పుడూలేని విధంగా ఓ డిజిటల్ ట్రేడింగ్‌కు సంబంధించిన ప్రమోషన్ పోస్టుల రీట్వీట్లు దర్శనమివ్వడంతో జనసేన అభిమానులను, కార్యకర్తలు కంగారు పడ్డారు. పార్టీకి సంబంధం లేని పోస్టులు కావడంతో ‘జనసేన అకౌంట్ హ్యాక్ అయ్యిందా?’ అనే అనుమానంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచే జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ మార్పులు కనిపించాయి. దీంతో, అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ రీట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే, ఈ వ్యవహారంపై జనసేన అధికారిక వర్గాలు ఇప్పటివరకు స్పందించలేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారా?, లేదా? అన్నది కూడా తెలియరాలేదు. అయితే, విషయాన్ని గమనించి, అప్రమత్తమైన జనసేన సోషల్ మీడియా టీమ్, అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉందని తెలుస్తోంది.
Read Also- Stress Relief: మతిమరుపు, ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే, ఈ చిట్కాలు పాటించండి!
ఏమైనా కుట్ర ఉందా?
ప్రముఖ వ్యక్తుల ఎక్స్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురికావడం కొత్తేమీ కాదు. పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న పలు రాజకీయ పార్టీల అకౌంట్లు కూడా హ్యాకింగ్ బారినపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, జనసేన ఎక్స్ ఖాతా హ్యాకింగ్ వ్యవహారం వెనుక ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఉందా?, లేక సైబర్ నేరగాళ్లు ఈ చర్యకు పాల్పడ్డారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనల్లో బీజీగా ఉన్న సమయంలో ఈ దాడి జరగడం అనుమానాలకు తావిస్తోంది. నెటిజన్లకు జనసేనకు సంబంధించిన సమాచారాన్ని చేరవేసే ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ ఖాతాను హ్యాక్ చేయడం ద్వారా సమాచారాన్ని అడ్డగించేందుకు ఈ ప్రయత్నం చేశారేమో అన్న అనుమానాలు జనసేన కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి.
గతేడాది జనసేన పార్టీ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా హ్యాక్ చేసిన సందర్భాన్ని ఆ పార్టీ అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలకు, పాపులర్ వ్యక్తులకు చెందిన సోషల్ మీడియా ఖాతాలకు హ్యాకింగ్ ముప్పు ఉన్నట్టుగా గుర్తుచేస్తోంది. పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉండే అధికారిక ఖాతాలపై హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల గురిపెట్టే అవకాశం ఉంటుంది.
Read Also- Mahabubabad District: రెడ్యాలలో అంగరంగ వైభవంగా పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు!
