Vijayasai Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) నీడగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అదిగో బీజేపీలోకి.. ఇదిగో జనసేనలోకి చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయే తప్ప, ఇంతవరకూ చేరిందేమీ లేదు. పైగా సాయిరెడ్డి కూడా ఒకసారి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఉండదని.. మరోసారి ప్రజలు కోరుకుంటే మళ్లీ తిరిగొస్తానని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను మళ్లీ రాజ్యసభకు పంపే యోచనలో కమలనాథులు ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు.. గవర్నర్ పదవి ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా కూడా గుసగుసలు వినిపించాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే అసలు విజయసాయి బీజేపీలో (BJP) చేరుతున్నారా? లేదా? అనేదానిపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమువీర్రాజు (Somu Veerraju) మీడియాతో మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ముహుర్తాలు మీకు చెబుతామా?
బుధవారం మీడియాతో మాట్లాడిన వీర్రాజు.. విజయసాయి ప్రస్తావన తెచ్చారు. గతంలో వైసీపీ, టీడీపీ తమ పార్టీల్లో చేర్చుకొన్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు ప్రశ్నించని వారు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అని విమర్శకులు, మీడియాకు ఎదురు ప్రశ్న సంధించారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారా? లేదా? అనేది తన దృష్టిలో లేదని చెప్పారు. అయితే ఒకవేళ ఎవరైనా బీజేపీ జాయిన్ అయితే ఆ ముహూర్తాలు మీకు చెబుతామా? అంటూ వీర్రాజు ఒకింత ఆగ్రహానికే లోనయ్యారు. కుహానా రాజకీయ నేతలు వలన దేశానికి నష్టమని.. వీళ్లు అద్దె మైకులు, వీళ్ళు భారతీయులు కాదని విమర్శలు గుప్పించారు. సెక్యులర్ విధానాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. ‘ పాకిస్థాన్‌పై యుద్ధాన్ని విరమించాం అని చెప్పలేదు. ఇంకా పెద్ద సినిమా ఉంది. యుద్ధాన్ని ఆపలేదు. సినిమా అంతా ముందు ఉంటుంది. సరైన సమయంలో యాక్షన్ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ మదిలో అన్ని విషయాలు ఉన్నాయి. ఎప్పుడేం చేయాలో మోదీకి అన్నీ తెలుసు. పాకిస్థాన్, పీఓకేపై దాడి తర్వాత కుహానా లౌకిక వాదులు కలుగులోకి వెళ్ళిపోయారు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ. యుద్ధం ఆపమని డోనాల్డ్ ట్రంప్ చెబితే ఆగడం అంటూ ఉండదు’ అని వీర్రాజు వ్యాఖ్యానించారు. మొత్తానికి చూస్తే.. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు వీర్రాజు మాటలను బట్టి చూస్తే.. సాయిరెడ్డి లాంటి వానే పార్టీలోకి వస్తే మంచిదేనని చెప్పకనే చెప్పారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలన్న ఆలోచన విజయసాయిరెడ్డి మనసులో ఉందా? లేదా? అనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణకు సోమువీర్రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే. నారాయణ వెంటనే పాకిస్థాన్ వెళ్లిపోవాలి. ఇండియాలో జీవించే అర్హత ఆయనకు ఏమాత్రం లేదు. అక్కడి ప్రజలతో కలిసి నారాయణ జీవించాలి. దేశంలో ఇంత ఘోరం జరిగితే యుద్ధం వద్దని అంటారా? యుద్ధం చేయాలని దేశ ప్రజలంతా ఆవేశంతో రగిలిపోతూ ఉంటే యుద్ధం వద్దు అనడమేంటి? సీపీఐ పార్టీ నుంచి నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలి’ అని వీర్రాజు డిమాండ్ చేశారు. అంతకుముందు నారాయణ మాట్లాడుతూ ఉగ్రవాదుల మీద భారత ఆర్మీ దాడిని సమర్థిస్తున్నామని, కానీ, పాక్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. అంతేకాదు యుద్ధానికి తాము వ్యతిరేకమని కూడా వ్యాఖ్యానించారు. ఇలా ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధమే నెలకొన్నది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంట్రీతో భారత్-పాక్ మధ్య యుద్ధం కూడా ఆగిపోయింది.
Read Also- YSRCP: వైసీపీకి ఊహించని ఝలక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ.. ట్విస్ట్ ఏమిటంటే..?