YSRCP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మొదలుకుని, నేటి వరకూ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు, షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లెఫ్ట్, రైట్ హ్యాండ్స్ అనిపించుకున్న.. అత్యంత నమ్మకస్తులుగా ఉన్నవాళ్లంతా రాజీనామా చేసేసి వేర్వేరు పార్టీల్లోకి జంప్ అయిపోయారు. ప్రస్తుతానికి జగన్ కాకుండా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సైలెంట్‌గానే ఉన్నారు కానీ.. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మాత్రం పార్టీకి రాజీనామా చేసి కండువాలు మార్చేస్తున్నారు. దీంతో అటు రాజ్యసభలో.. ఇటు శాసన మండలిలో జగన్ బలగం తగ్గిపోతున్నది. ఈ క్రమంలోనే వైసీపీకి మరో ఊహించని ఝలక్ తగిలింది. మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ, అందులోనూ పులివెందుల-2గా అభిమానులు చెప్పుకునే రాయచోటి నియోజకవర్గానికి చెందిన కీలక నేత.. జకియా ఖానం (Zakia Khanam) వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు పంపారు. జకియా 2020 జులైలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత అసంతృప్తిగా ఉన్న ఆమె.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరికి బుధవారం వైసీపీకి రాజీనామా చేసి ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

కులమతాలకు అతీతంగా..
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో జకియా బీజేపీ (BJP) కండువా కప్పుకున్నారు. కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా కమలనాథులు ఆహ్వానించారు. విజయవాడ బీజేపీ కార్యాలయం ఈ చేరికకు వేదికైంది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జకియా ఖానం.. ప్రధాని నరేంద్ర మోదీ కులమతాలకు అతీతంగా అందరినీ తన బిడ్డలుగా భావించారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వక్ఫ్ సంపదలో ముస్లిం పేదలు కూడా భాగస్వాములు కావాలని ప్రధాని ఆలోచించారనే విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీలోకి వచ్చి ముస్లిం మైనార్టీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆలోచించానని.. తనను చూసి మైనారిటీలు మరింత మంది బీజేపీలో చేరాలని జకియా ఆశించారు. కాగా, రాజీనామా ముందు వరకూ శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌గా జకియా వ్యవహరించారు. ఈమెపై తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ఆరోపణ కూడా ఉన్నది.
ఈ చేరికతో..?
కాగా, జకియా కాషాయ కండువా కప్పుకోవడంతో బీజేపీ మతతత్వ పార్టీ కాదని మరోసారి రుజువైందని పురందేశ్వరి తెలిపారు. ‘ కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం, మూల సిద్ధాంతం. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోంది. జకియా ఖానం భర్త టీడీపీ కోసం పని చేశారు. ఇప్పుడు జకియాను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్‌తో మోదీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. బలమైన నాయకత్వం ఉంటే ఎలాంటి పరిణామాలుంటాయో ప్రస్తుత పరిస్ధితులతో తెలుస్తుంది’ అని పురందేశ్వరి వెల్లడించారు. కాగా, ఈ చేరికతో కేవలం పార్టీ మారడం మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఓ కొత్త వ్యూహాత్మక దిశగా అడుగులు వేస్తోందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే బీజేపీకి ఇది మైనార్టీలలో పునాది వేయడం లాంటిదే. ఇకపై మరికొంత మంది మైనారిటీ నేతలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
టీడీపీలో ఎందుకు చేరలేదు?
వాస్తవానికి.. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుల వ్యవధిలోనే మంత్రి నారా లోకేష్‌ను జకియా ఖానం కలిశారు. దీంతో అప్పుడే ఆమె టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకుంటారని.. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందనే చర్చ జరిగింది. కానీ, రాయచోటిలో నెలకొన్న కొన్ని పరిణామాలు, జిల్లా టీడీపీ నేతలు, మంత్రి ఈ చేరికను అంగీకరించలేదని సమాచారం. ఎందుకుంటే రాయచోటి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కడప జిల్లాలో మైనార్టీ సామాజికవర్గం ఎక్కువగా ఉన్నది. దీంతో జకియా చేరికతో ఎక్కడ తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందో అని టీడీపీ నేతలు ఒకింత అభద్రతగా భావించారని తెలుస్తున్నది. దీంతో వేరే ఆప్షన్ లేక, వైసీపీలో ఉండలేక, పార్టీకి, పదవికి రాజీనామా చేసి చివరకు బీజేపీలో చేరిపోయారు. అదిగో, ఇదిగో టీడీపీలోకి అంటూ హడావుడి జరిగిన తర్వాత ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చిన జకియా ఖానం కాషాయ కండువా కప్పుకోవడంతో అభిమానులు, అనుచరులు సైతం ఒకింత ఆశ్చర్యపోయారు.
Read Also- Kolikapudi: ఇంతకీ.. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేనా.. ఎంపీనా?