Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కూటమి నేతలు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు తదితరులు పెద్ద ఎత్తున ఈకార్యక్రమంలో పాల్గోనున్నారు. ప్రధానంగా ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధిపై చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈసమావేశంలో సీఎం నేతృత్వంలో విస్తృతంగా చర్చించనున్నారు. అంతేగాక స్వర్ణాంధ్ర- 2047 విజన్ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పరిశీలించారు. ప్రధాన వేదిక, సమావేశ ప్రాంగణంలో సిటింగ్ ఏర్పాట్లు, లైటింగ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
Read Also- Chiranjeevi: ఇకపై నాగ్ దారిలోనే నేను.. ధనుష్‌కి బెస్ట్ యాక్టర్ రాకపోతే..!
అందరితో కలిసి భోజనం..
రెగ్యులర్‌గా జరిగే సమావేశాలకు భిన్నంగా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. మొత్తం సమావేశ ప్రాంగణంలో ప్రత్యేకంగా రౌండ్ టేబుళ్ళను ఏర్పాటు చేశారు. ఈ టేబుళ్ళ వద్ద జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చుని ఆయా నియోజకవర్గాల్లో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పధకాల ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. అంతేగాక వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ (Swarnandhra Vision 2047) ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. సమావేశం అనంతరం అందరితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సమావేశంలో పాల్గొనే ప్రతినిధులు కూర్చునేందుకు ప్రధాన వేదికతో కూడిన రౌండ్ టేబుళ్ళతో సభా ప్రాంగణం సిద్ధమైంది. దానిని ఆనుకుని సమావేశానికి వచ్చిన సీఎం, డిప్యూటీ సీఎం.. సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు రాత్రి భోజనం చేసేందుకు మరో ప్రాంగణం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జూన్ 12నే అనుకున్నా..
సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధానిలో ఈ కార్యక్రమం జరగనుంది. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా.. అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. రేపటి సమావేశంలో ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక, పాలనా విధ్వంసాలను సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర @2047 విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని కూడా కూటమి ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు-పెట్టుబడులను తీసుకురావటం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన తదితర అంశాల్లో వేగంగా అడుగులు వేస్తోంది.
Read Also- Pawan Kalyan: విజయ్‌తో తలపడనున్న పవన్ కళ్యాణ్.. పెద్ద ప్లానే!