Thalliki Vandanam: అవును.. సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీ అయిన ‘తల్లికి వందనం’ పథకాన్ని కూటమి సర్కార్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నాడు ఈ పథకానికి సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా.. శుక్రవారం ఉదయం నుంచే తల్లుల అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా టీడీపీ రిలీజ్ చేసింది. అయితే ఇదంతా ఫేక్ అని ఏ ఒక్క తల్లి అకౌంట్‌లో పైసా కూడా పడలేదని, తల్లికి వందనం కాదని.. తల్లికి వంచన అంటూ వైసీపీ (YSR Congress) తీవ్ర ఆరోపణలు చేసింది. తల్లికి వందనం పేరిట తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేష్) లక్షలాదిమంది విద్యార్థులను మోసం చేస్తున్నారని, విద్యార్థుల సంఖ్యను తగ్గించడమే కాకుండా రూ.15 వేలు బదులుగా రూ.13 వేలే ఇస్తామంటున్నారని.. ఇది కదా అసలైన మోసం అంటూ వైసీపీ దుమ్మెత్తి పోస్తోంది. ఇటు వైసీపీ వ్యాఖ్యలు చేయడం, అటు టీడీపీ కౌంటర్ ఇవ్వడమే సరిపోయింది. దీంతో ఇది కాస్త వివాదంగా మారుతున్న పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియా ముందుకొచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Read Also- Agri Gold: అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట.. వెయ్యి కోట్లు వచ్చేశాయ్!
ఛాలెంజ్.. తేల్చుకుందాం రా!
వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ (Nara Lokesh) ఛాలెంజ్ చేశారు. ‘ తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీ పైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీ ఫేక్ ప్రచారంపై కఠినమైన చర్యలు ఉంటాయి. జగన్.. ఈ ఛాలెంజ్‌కి రెడీనా? ఫేక్ ప్రచారం చేసి పారిపోవటం కాదు.. నిరూపించు. లేదంటే నీ ఫేక్ ప్రచారంపై చట్టప్రకారం చర్యలు తప్పవు’ అని లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్, ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు.. ‘ కొందరి ఖాతాలు యాక్టివ్ లేక నిధులు తిరిగి వచ్చాయి. ఆయా ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని తల్లులను కోరుతున్నాం. దీనికి సంబంధించి ఎస్ఎంఎస్ (SMS) కూడా పంపిస్తున్నాం. తల్లికి వందనం అందకపోతే మనమిత్ర యాప్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి వారికి ఖాతాలు యాక్టివేట్ అయ్యాక తల్లికి వందనం నగదు వేస్తాం. సూపర్ సిక్స్‌లో మరో హామీని అమలు చేశాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం’ అని లోకేష్ తేల్చి చెప్పారు. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ తల్లికి వందనం సూపర్ సక్సెస్‌తో ఫేక్ జగన్, కడుపు మంటతో, తన ఆస్థాన విద్యకి పదును పెట్టాడు. ఒక పక్క ప్రజలందరూ తమకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి అంటూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, ఏమి చేయాలో తెలియక, తన ఫేక్ ముఠాతో ఫేక్ చేసిన స్క్రీన్ షాట్స్‌ను టీడీపీ వాళ్ళు వేసినట్టు ఫేక్ చేస్తున్నాడు. తల్లికి వందనం డబ్బులు పడిన ప్రతి మహిళకి నీ ఫేక్ బుద్ది తెలుసు జగన్. ఇలాంటి చిల్లర పనులు కాకుండా, ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్’ అని హితవు పలికింది.
ఇదిగో ఆధారాలున్నాయ్..
‘ గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన బొత్సా సత్యనారాయణ, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. యూడీఐఎస్ఈ (UDISE) డేటా చూపించి రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అంటున్నారు. అందులో అంగన్వాడీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదని తెలియదా? అలాగే జీఈఆర్ (GER) చూపించటం కోసం 18 ఏళ్ళు దాటిన వారిని, పక్క రాష్ట్ర పిల్లలని తీసుకొచ్చి ఇక్కడ చదివినట్టు చూపించారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇలాంటి దొంగ లెక్కలు చూపించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అర్హులు ఎంత మంది ఉన్నారో, అంత మందికీ మేము తల్లికి వందనం ఇస్తాం. ఇందులో రెండో ఆలోచనే లేదు. తల్లికి వందనంలో అర్హత ఉన్న ఏ ఒక్కరినీ మేము వదిలేయం. తల్లికి వందనం రాకపోతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ జూన్ 26 వరకూ మీ ఫిర్యాదులు పంపవచ్చు. పరిశీలించి మీ సమస్య పరిష్కారం చేసి, మీకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్ని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కష్టపడుతున్నాం. ప్రభుత్వ బడుల్లో బోధన నాణ్యత పెంచాలనేదే మా లక్ష్యం. చాగంటి కోటేశ్వరరావు సూచనలు తీసుకుని, నైతిక విలువలకు సంబంధించిన కంటెంట్ పిల్లలకు ఇస్తున్నాం. ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను కోరుతున్నాను’ అని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
Read Also- Thalliki Vandanam: తల్లికి వందనం పథకంలో రూ.2వేలు ఎగనామం.. ఎందుకనీ?