Love Affair Revenge: ప్రేమించినవాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రియురాలు (Love Affair Revenge) జీర్ణించుకోలేకపోయింది. తీవ్రమైన ధ్వేషాన్ని పెంచుకొని, ఊహకందని దారుణానికి పాల్పడిన ఘటన కర్నూలులో వెలుగుచూసింది. ప్రేమించిన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిసి, అతడి భార్యకు హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ (HIV Virus Injection) ఇచ్చింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆదోనికి చెందిన వసుంధర, కరణ్ కుమార్ ఇద్దరి మధ్య కొన్నేళ్లపాటు ప్రేమాయణం నడిచింది. అయితే, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి విడిపోయారు. దీంతో, ప్రియుడు కిరణ్ కుమార్ డాక్టర్ శ్రావణి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. డాక్టర్ శ్రావణి కర్నూలు జీజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డ్యూటీ చేస్తోంది. ఇక, కిరణ్ కుమార్ కూడా కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. అయితే, ఈ దంపతులు ఇద్దరిని విడదీయాలని వసుంధర భావించింది.
పక్కా ప్లాన్
ఈ నెల 9న వైద్యురాలు శ్రావణి డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలేరారు. వెళుతున్న క్రమంలో నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంతో ఆమె వాహనాన్ని ఢీకొట్టారు. కిందపడిన శ్రావణిని సాయం చేస్తున్నట్టు నటించి ఆటోలో ఎక్కిస్తూ ఓ హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్‌ను వసుంధర ఎక్కించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.
కలిసి ప్లాన్ చేశారా?
మాజీ ప్రేమికులు వసుంధర, కిరణ్ కుమార్ ఇద్దరూ కలిసి ఈ ప్లాన్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిందితులను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. కాగా, నలుగురు నిందితులు దర్యాప్తులో కీలక విషయాలు చెప్పారు. నిందితురాలు వసుంధరకు మరో నర్సుకు చెందిన కూతురు, కొడుకు సహకరించినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటన నేపథ్యంలో నిందితురాలు వసుంధర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

