Telangana Police: దక్షిణాది కుంభమేళగా చెప్పే సమ్మక్క.. సారలక్క జాతరకు కోట్లాది మంది భక్తులు వచ్చే విషయం తెలిసిందే. లక్షలాది మంది అమ్మవార్లను దర్శించుకునేందుకు భార్యాపిల్లలతో కలిసి వస్తారు. ప్రతీసారి ఎంతోమంది చిన్నపిల్లలు జాతరలో తప్పిపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో తల్లిదండ్రులు పడే పడే టెన్షన్ అంతా ఇంతా ఉండదు. అయితే, ఈసారి అలా జరగకుండా చూడటానికి రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. జాతరలో తప్పిపోయే దివ్యాంగులు, చిన్నపిల్లల ఆచూకీని వెంటనే కనిపెట్టి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ రిస్ట్ బ్యాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ సహకారంతో రూపొందించిన ఈ వినూత్న క్యూ ఆర్ కోడ్ ఆధారిత రిస్ట్ బ్యాండ్లు, పోస్టర్లను డీజీపీ శివధర్ రెడ్డి, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ చారు సిన్హాతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ములుగు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని చెప్పారు.
ఈ సాంకేతికతను అందుబాటులోకి
ఇంతటి భారీ రద్దీలో చిన్న పిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగులు తప్పిపోయే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఈ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఎస్ఐబీ ఐజీ సుమతి ఒకటిన్నర నెలలపాటు కష్టపడి ఈ విధానాన్ని సిద్ధం చేశారంటూ ఆమెను ప్రశంసించారు. దీనికి వోడాఫోన్ యాజమాన్యం అందించిన సహకారం అభినందనీయమన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డిజిపి చారు సిన్హా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జాతరలో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మహా కుంభమేళా వంటి ఇతర భారీ ఉత్సవాల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా జాతరకు వచ్చే పిల్లలు, దివ్యాంగుల వివరాలను నమోదు చేసి వారి చేతికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్‌ను కడతామని తెలిపారు.
Also Read: Medaram Jatara 2026: మేడారం జాతర స్పెషల్.. 4,000 ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన
11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు
దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లోని బృందాలు పిల్లల పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లను నమోదు చేస్తాయన్నారు. అనంతరం వారికి రిస్ట్ బ్యాండ్లు ఇస్తారని చెప్పారు. జాతరలో ఒకవేళ ఎవరైనా తప్పిపోయి కనిపిస్తే వాలంటీర్లు, పోలీసు సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్‌లతో ఆ బ్యాండ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. వెంటనే వారి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఫోన్ నంబర్లు, డయల్ 100 వివరాలు కనిపిస్తాయని తెలిపారు. తద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సురక్షితంగా అప్పగించే అవకాశం ఉంటుందన్నారు. ఆ తరువాత పిల్లలు, వారి తల్లిదండ్రుల ఫోటోలను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు. దీని కోసం 25వేల రిస్ట్ బ్యాండ్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ రిస్ట్ బ్యాండ్లు ఈనెల 27 నుంచి 31 వరకు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసే 11 కేంద్రాల్లో లభిస్తాయన్నారు.
ఆ ప్రాంతాల్లో
హనుమకొండ హయగ్రీవా చారి గ్రౌండ్, హైదరాబాద్‌లోని ఉప్పల్ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటు వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఈ రిస్ట్ బ్యాండ్ల కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు డీజీపీ చెప్పారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఎవరైనా క్యూఆర్ కోడ్ బ్యాండ్ ధరించి ఒంటరిగా కనిపిస్తే వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీలు మహేష్ భగవత్, చారు సిన్హా, డి.ఎస్.చౌహాన్, ఐజిపిలు చంద్రశేఖర్ రెడ్డి, బి.సుమతి, డాక్టర్ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Medaram Jatara 2026: మేడారం మహా జాతరకు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఈసారి ప్రత్యేకతలివే..!

