Pawan Kalyan: గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ (YCP) సభ్యులు చేసిన నిరసనపై జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ అయిదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది రాదని స్పష్టం చేశారు. దీనికి జగన్ (Jagan) ఫిక్స్ అయిపోవాలని, అది ముఖ్యమంత్రో, తానో కావాలని చేసింది కాదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల ప్రకారమే వైసీపీకి హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సినన్ని సీట్లను వైసీపీ గెలవలేకపోయిందని గుర్తు చేస్తారు. ఈ విషయం తెలిసినా కావాలనే విలువైన శాసనసభా సమయం వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
జర్మనీ వెళ్తే బెటర్
ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బెటర్ అంటూ సెటైర్లు వేశారు. ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించారని, అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటారని అన్నారు. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ఉందన్న పవన్, జనసేన కంటే ఒక సీటు అధికంగా తెచ్చుకొని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేదని చెప్పారు. కానీ, వారికి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అర్థం చేసుకోవాలని, అంతేకాని రాని హోదా కోసం విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేయడం తగదని హితవు పలికారు.
వైసీపీ తీరు బాధాకరం
ప్రతిపక్ష హోదా డిమాండ్ పేరుతో అసెంబ్లీకి రాకుండా వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తున్నదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు గత కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోయినా బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఆయన ప్రసంగించేందుకు వచ్చారని, పూర్తిస్థాయిలో వినకుండా వైసీపీ నానా యాగీ చేసిందని మండిపడ్డారు. ప్రసంగ ప్రతులు చింపి వేయడం, మధ్యలో వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదన్నారు. వారు అనుసరిస్తున్న వైఖరి నిజంగా బాధాకరమని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి వస్తే కదా.. టైమ్ ఎంత ఇస్తారో తెలిసేది
వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని పవన్ అన్నారు. ప్రజల సమస్యలపై స్పందించాలని, హుందాగా చర్చల్లో పాల్గొనాలని సూచించారు. జగన్ సభకు వస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో తెలుస్తుందని చురకలంటించారు. అసలు సభకే రాకుండా, రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్లు చేయడం అనేది పూర్తిగా అనైతికమని వ్యాఖ్యానించారు. మొదటి సమావేశాల్లోనే వైసీపీ నాయకులకు గవర్నర్, ముఖ్యమంత్రి, తాను తగిన గౌరవం ఇచ్చామని గుర్తు చేశారు. 11 సీట్లే వచ్చాయని వారిని ఎవరూ తక్కువ చేసి చూడలేదని, తగిన మర్యాద ఇస్తున్నామని వివరించారు.
Read Also: YS Jagan: హోదా ఉంటేనే వస్తాం.. జగన్ అతిగా ఆశ పడుతున్నారా?
Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?