Vangaveeti Radha Krishna: టీడీపీ సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి దక్కనుంది. అతి త్వరలోనే రాధాను పదవి వరించనున్నట్లు స్వయానా సీఎం చంద్రబాబే చెప్పడం విశేషం. ఈ ప్రకటనతో ఇన్నాళ్లు కూటమి సర్కార్, ముఖ్యమంత్రిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన వంగవీటి అనుచరులు, అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎమ్మెల్యే సీటు దక్కకపోవడం, ఎమ్మెల్సీ రాకపోవడం, కనీసం నామినేటెడ్ పదవి కూడా వరించకపోవడంతో వంగవీటి తీవ్ర అసంతృప్తి, అసహనానికి లోనయ్యారు.
ఈ క్రమంలోనే తన అనుచరులు, సామాజిక వర్గ సభలో అసలు రాజకీయాలు అవసరమా? ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కొనసాగాలి? అన్నట్లుగా అసంతృప్తిని వెలిబుచ్చారు. అయితే కాస్త ఓపిక పట్టాలని అభిమానులు నచ్చజెప్పినప్పటికీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, వ్యాపారాలు చూసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న టీడీపీ హైకమాండ్ బుధవారం సీఎంవోకు పిలిపించి మాట్లాడింది.
అడగకుండానే అపాయిట్మెంట్ ఇచ్చి మరీ రాధాతో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలకు పైగానే ఇరువురూ తాజా పరిణామాలు, పదవిపై చర్చించారు. చివరికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ప్రాధాన్యత ఉండే కీలక పదవిలో కూర్చోబెడతానని రాధాకు మాటిచ్చి, మీటింగ్‌ను ముఖ్యమంత్రి ముగించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో కాపు సామాజిక వర్గం, వంగవీటి అనుచరులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
Also read: BRS vs Congress: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. నీటి విడుదలపై రాజకీయ రగడ.. వివాదం ఎందుకంటే?
కాపులకు పెద్ద పీట!
వాస్తవానికి చంద్రబాబు తొలి నుంచీ కాపులకు ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో, ఈ మధ్యనే ఎమ్మెల్సీల విషయంలోనూ పెద్ద పీట వేశారు. ఇటీవలే సోము వీర్రాజు, కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు కూడా సర్కార్ కట్టబెట్టింది. అయితే కాపు సామాజికవర్గంలో బలమైన నేత, వంగవీటి తనయుడు వంగవీటి రాధాకు కీలక పదవి కట్టబెడితే అటు టీడీపీ, ఇటు కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంటుందని భావించారట.
అందుకే ఈ మధ్య ఎలాంటి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రాధాను పిలిపించుకొని మరీ చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తున్నది. వాస్తవానికి ఎమ్మెల్సీ దక్కుతుందని, కేబినెట్‌లో చోటు కూడా దక్కుతుందని వంగవీటి అభిమానులు, అనుచరులు ఎంతగానో ఆశపడ్డారు. మంత్రి సంగతి అటుంచితే కనీసం ఎమ్మెల్సీ, ఆఖరికి నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. దీంతో రాధా డీలా పడిపోయారు.
Also read: Chit Fund Fraud: చిట్టీల పుల్లయ్య ఇంట్లో పోలీసుల తనిఖీలు.. సోదాలో బైటపడినవి ఇవే..
పార్టీ కోసం సీటు త్యాగం చేసినా, అహర్నిశలు కష్టపడినా పట్టించుకోకపోవడం ఏంటి? ఇలాంటి పార్టీలో ఉండటం అవసరమా? అని రాజకీయాలకే గుడ్ బై చెప్పేయాలని భావిస్తున్న సమయంలో రాధాను పిలిచి ఏ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయాం? అని సామాజిక సమీకరణాలు, పరిస్థితులన్నీ నిశితంగా చంద్రబాబు అండ్ కో వివరించారు. దీంతో కాస్త కోలుకున్న రాధాకు పదవి ఇస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు పంపారు. వంగవీటికి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు? నామినేటెడ్ పదవితో సరిపెడతారా? లేదంటే విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభకు రాధాను పంపుతారా? అనేది తెలియాల్సి ఉంది.