Chandrababu: విజనరీ లీడర్‌గా పేరుగాంచిన చంద్రబాబు ఏదో ఒక వినూత్న ఆలోచన చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకూ ఎన్నో ఆవిష్కరణలు చేసిన సీబీఎన్.. తాజాగా మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మనుషులకు ఆధార్ లాగా పశువులకు గోదార్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్‌కు (Tech AI Conclave) ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పశువులకు గోదార్‌ను తెస్తున్నట్టు పలు స్టార్టప్ కంపెనీలు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చాయి. దీనిపై ఆసక్తి చూపిన చంద్రబాబు వెంటనే మనసులోని మాటను బయటపెట్టారు. గోదార్‌కు తిరుపతి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ఆ కంపెనీలకు సూచించారు. తిరుపతి జిల్లాలోని అన్ని పశువులకు గోదార్ అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కోళ్లకు వచ్చే వ్యాధులు గుర్తించడం, వాటి ఆరోగ్య విషయాలు తెలపడంపై ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలని స్టార్టప్ కంపెనీలను చంద్రబాబు కోరారు.

‘ ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్‌లోనే. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (Public And Private Partnership) వచ్చింది. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను ఎంతో చక్కగా నిర్మించాం. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతున్నది. అందుకే సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాం. ఏపీలో వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతాం’ అని చంద్రబాబు చెప్పారు. స్టార్టప్ కంపెనీలతో సీఎం నిర్వహించిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also- Kolikapudi: ఇంతకీ.. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేనా.. ఎంపీనా?
నేను నిత్య విద్యార్థిని..
‘ నేను నిత్య విద్యార్ధిని. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా. టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. సాంకేతిక యుగంలో అందరూ సమర్థత పెంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులే ఉన్నారు. అందులోనూ తెలుగువాళ్లే ఎక్కువగా ఉన్నారు. నా ఆలోచన ఒక్కటే. మనం మాత్రమే బాగుంటే చాలదు.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. పశు సంవర్ధక శాఖలో కీలక మార్పులు చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. రైతులకు ఉపయోగపడేలా వాట్సప్‌లోనే (Whatsapp Governance) అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలి’ అని చంద్రబాబు సూచించారు. రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్స్ తయారు చేస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ, అప్పటికప్పుడు సీఎం నిర్ణయం తీసుకున్నారు. మిల్క్ డైరీల నుంచి రైతులకు నిత్యం ఆదాయం వస్తోందని, టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ రైతు ఆదాయం డబుల్ అవుతోందని చెప్పారు. డెయిరీ పరిశ్రమలో కూడా పురోగతి ఉంటోందని చంద్రబాబు తెలిపారు.
Read Also-YSRCP: వైసీపీకి ఊహించని ఝలక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ.. ట్విస్ట్ ఏమిటంటే..?