Chandrababu: రాయలసీమకు నీరిచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మరిచిపోలేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సందర్భంగా.. హంద్రీనీవా ప్రాజెక్టు (Handri Neeva) నీటితో బాగుపడే రైతన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో మోటార్లు ఆన్ చేసి హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని రైతులతో కలిసి విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీ-నీవా కాల్వ ద్వారా నీటి విడుదల చేశారు. ఎత్తిపోతల వద్ద రైతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం జలహారతి ఇచ్చారు. అనంతరం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు కాల్వలే కాకుండా భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సోమశిల-స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
Read Also- Nimisha Priya: నిమిషా మరణశిక్షపై మరోసారి స్పందించిన కేంద్రం
ఫుల్ హ్యాపీగా ఉన్నా..
నందికొట్కూరులో నీటి వినియోగదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సీమకు నీళ్లివ్వడంతో వచ్చే ఆనందం, తృప్తి జీవితంలో మరిచిపోలేనన్నారు. ‘మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. నేను ఈ ప్రాంతంలో పుట్టాను. సీమ రైతుల కష్టాలు.. ఇక్కడి కరవు పరిస్థితులు నాకు తెలుసు. రాయలసీమ (Rayalaseema) ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. పశువులకు గ్రాసం కూడా దొరకని దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజుల్లో రైళ్లల్లో పశుగ్రాసం తెప్పించాం. రాయలసీమ చరిత్ర తిరగరాయాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్. రాయలసీమకు నీళ్లు రావన్నారు.. రాజకీయాలు చేశారు పెత్తందారులు ఉన్నారు. రాయలసీమ బాగు కోసం టీడీపీ మినహా మిగిలిన నేతలెవ్వరూ ఆలోచన చేయలేదు. రాయలసీమ ప్రాజెక్టులకు నాందీ పలికింది ఎన్టీఆరే. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతే చెన్నైకు నీళ్లిస్తామని కేంద్రానికి స్పష్టంగా చెప్పిన నేత ఎన్టీఆర్. 554 కిలోమీటర్ల మేర హంద్రీ-నీవా కాల్వలను విస్తరించడం అసాధ్యం అని అందరూ అన్నారు. కాల్వల విస్తరణ చేయకుంటే చివరి భూములకు నీరందదు. ఆ భూములకు నీరందించేందుకు రూ.3890 కోట్లు కేటాయించి విస్తరణ పనులు చేపట్టాం. ఇప్పుడు ఫేజ్-1కు నీళ్లిచ్చాం. మరో 15 రోజుల్లో ఫేజ్-2 పనులు కూడా పూర్తి చేసేస్తాం.. చివరి భూములకు నీరందిస్తాం. నా సంకల్పానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు, అందరూ సహకరించారు. గ్రేట్ జాబ్.. బిగ్ కంగ్రాచ్యులేషన్స్. కృష్ణగిరి, అనంతపురం, జీడిపల్లి, పీఏబీఆర్ వంటి ప్రాజెక్టులకు నీరు అందుతుంది’ అని చంద్రబాబు వెల్లడించారు.
సవాళ్లు కొత్తేమీ కాదు..
‘ నాకు సవాళ్లు కొత్త కాదు.. అసాధ్యమనుకున్న పనులను పూర్తి చేయడాన్ని నేను సవాలుగా తీసుకుంటాను. రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు శరవేగంగా చేశాం. మొదటి ఫేజ్ పూర్తి చేసి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేశాం. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడం వల్ల సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్ 2 పనులు పూర్తి చేద్దాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు. సంపద సృష్టికి మూలమైన జలాన్ని ప్రతి ఎకరాకు అందిచాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో సహకారంతో నేరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం. శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు.. కలియుగ దైవం తిరుమల వెంకన్న వరకు తీసుకుని వెళ్ళే పరిస్థితి వస్తుంది. జలాల అనుసంధానం పూర్తి చేసి జలహారతి ఇద్దాం. ఈ రకమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల, పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
Read Also- Viral News: తండ్రి చనిపోయి వర్క్‌ఫ్రమ్ హోం అడిగితే.. మేనేజర్ ఏమన్నాడంటే?