Chandrababu: యోగా డే (Yoga Day) రోజున రికార్డ్స్ బ్రేక్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చటమే లక్ష్యమని తెలిపారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రమంతా లక్ష ప్రదేశాలలో రెండు కోట్ల మంది యోగాలో పాల్గొని రికార్డ్ సృష్టించబోతున్నారన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విచ్చేస్తున్నారు. యోగా డేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాలలో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ. కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్ ఏర్పాట్ల గురించి సీఎంకు వివరించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యేలా స్ఫూర్తినిచ్చే విధంగా.. ‘యోగా డే’ జరగాలని అధికారులకు సూచించారు. ‘ 24 గంటల్లో మన కోసం మనం ఒక గంట కేటాయించుకోవాలి. యోగా లాంటివి చేసుకుంటే, ఏ రోగాలూ దరి చేరవు. ఎవరికీ భారం కాకుండా, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. నేనెప్పుడూ ఇష్టపడే నగరం విశాఖపట్నం. ఏదైనా మంచి విషయం చెబితే వెంటనే గ్రహించే మనస్తత్వం విశాఖ ప్రజలది’ అని చంద్రబాబు తెలిపారు.
Read Also- AP Politics: కూటమి ఏడాది పాలనపై సర్వే.. కలలో కూడా ఊహించని విషయాలు వెలుగులోకి!
మాక్ యోగా నిర్వహించాలి..
ఈ యోగా డేకు 607 సచివాలయాల సిబ్బంది హాజరవుతున్న వారిని సమన్వయం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని చంద్రబాబు చెప్పారు. ఉదయం 06:30 నుంచి 08 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని.. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. ప్రధాని సహా ముఖ్యులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి యోగాడే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లను ఏ విధంగా చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆర్కే బీచ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తూ ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌కు ముఖ్యమంత్రి వెళ్లారు.
నిరంతరం కృషి..
ఇదిలా ఉంటే.. సెర్ప్ కార్యక్రంపై ఫేస్‌బుక్ వేదికగా చంద్రబాబు ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. ‘ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అనే ఒక మారుమూల ప్రాంతంలో వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యంతో గ్రామాల ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆనాటి ప్రాజెక్టు లక్ష్యం. అది కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)గా రూపాంతరం చెందింది. అప్పటి నుండి లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోంది. సెర్ప్ కార్యకలాపాలలో భాగస్వాములవుతూ.. నవసమాజ నిర్మాతలై గ్రామీణ పేదరిక నిర్మూలనను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్న గ్రామీణ మహిళలకు, వారిని ప్రగతి పథంలో నడిపిస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు’ అని చంద్రబాబు పోస్టులో పేర్కొన్నారు.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు.. అణుశక్తి!