YS Jagan on Amaravati: రాజధాని ప్రాంతం అమరావతిలో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రెండో దశ భూ సమీకరణపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి దశలో తీసుకున్న భూమినే ఇంకా అభివృద్ధి చేయకుండా.. మళ్లీ రైతుల నుంచి భూములు సేకరించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ డీపీఆర్ ప్రకారమే రాజధానికి రూ.1 లక్ష కోట్లు అవసరమన్న జగన్.. తొలి విడత ల్యాండ్ పూలింగ్ సమయంలోనే రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించినట్లు గుర్తుచేశారు. ఆ భూమి అభివృద్ధికి రూ.లక్ష కావాలని చంద్రబాబు పేర్కొన్నట్లు చెప్పారు.
రాజధాని నిర్మాణం సాధ్యమా?
మెుత్తంగా రూ.2 లక్షల కోట్లతో అమరావతి రాజధాని సాధ్యమా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అమరావతిలో ఇప్పటివరకూ రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలకే ప్రభుత్వం ఖర్చు చేస్తూ వచ్చిందని… అలా ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ప్రభుత్వానికి వస్తాయో? లేదో? కూడా తెలియదని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మి గతంలో భూములు ఇచ్చిన రైతులు.. ప్రస్తుతం లబోదిబోమంటున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గత హయాం లో రైతులకు ఇచ్చిన హామీలనే ప్రభుత్వం ఇప్పటివరకూ అమలు చేయలేదని జగన్ ఆరోపించారు.
భూములు దోచుకునేందుకు కుట్ర
తొలిదశ ల్యాండ్ పూలింగ్ సమయంలో తీసుకున్న భూముల్నే సరిగా అభివృద్ధి చేయనప్పుడు.. మళ్లీ రెండో దశ భూ సేకరణ ఎందుకని కూటమి ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. మరో 50 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకొని ఏం చేస్తారని జాతీయ మీడియాతో మాట్లాడుతూ సూటి ప్రశ్నించారు. మెుత్తంగా అమరావతి రాజధానికి అవసరమైన రూ.2 లక్షల కోట్లను ఎక్కడ నుంచి తీసుకొస్తారో చంద్రబాబు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. అమరావతిలో రైతుల భూములను దోచుకోవడానికే మరోమారు ల్యాండ్ పూలింగ్ డ్రామాకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని కామెంట్స్ చేశారు.
అమరావతిపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ డీపీఆర్ ప్రకారం రాజధానికి రూ.లక్ష కోట్లు కావాలి
రాజధాని కోసం తొలి విడతలో 50 వేల ఎకరాలు సేకరించారు
50 వేల ఎకరాలకు మరో రూ.లక్ష కోట్లు కావాలి
రూ.2 లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమా?
ఇంత మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారు?… pic.twitter.com/kxmxIPE6lk
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026
Also Read: AP Cabinet Meeting: ఏపీ కేబినేట్ సంచలనం.. ఏకంగా 35 అంశాలకు పచ్చజెండా
మంత్రి నారాయణ రియాక్షన్..
అమరావతి రాజధాని ప్రాంతంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానికి మద్దతు తెలిపిన వ్యక్తి.. మరోమారు విష ప్రచారం చేయడం తగదని వ్యాఖ్యానించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పై వైసీపీ నేతలకు కనీస అవగాహన కూడా లేదని మంత్రి ఎద్దేవా చేశారు. నదీ గర్భంలో రాజధాని కట్టడం లేదని.. నదికి దూరంగానే దానిని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిపై దుష్ప్రచారం చేసి ప్రజలను భయపెట్టాలని వైసీపీ చూస్తోందని మంత్రి ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో రాజధాని ప్రాంతాన్ని జగన్ పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు.

