CM Chandrababu: తెలుగుదేశం పార్టీ క్రమ శిక్షణకు మారుపేరు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటికీ అలానే ఉంది. ఇలాంటి పార్టీలో కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం గాడి తప్పుతున్నారు. మరికొందరు నిత్యం వివాదాల్లో మునిగితేలుతున్నారు. ఇంకొందరు పదవుల విషయంలో అలకబూనారు. వీరందర్నీ పదే పదే అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నా.. లైట్ తీసుకుంటున్నారా? ఆయన మాటే లెక్కచేయట్లేదా? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం. దీంతో ఎమ్మెల్యేల మీద చంద్రబాబుకు గ్రిప్ క్రమంగా తగ్గిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే కొందరి మంత్రుల తీరు ఆది నుంచి అలాగే ఉన్నది. వారికి స్వయంగా సీఎం క్లాస్ తీసుకున్నా, హెచ్చరించినా సరే ఇసుమంత కూడా మార్పు రాకపోవడం గమనార్హం.
క్లాస్‌లు, వార్నింగ్‌లు ఇవేమీ కొందరికి చెవికెక్కడం లేదని, వాళ్ల వైఖరి మారడం లేదని టాక్ నడుస్తున్నది. మరోవైపు మెల్లిగా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఆ నేతల వైఖరి మారుతోందని టీడీపీ వర్గాల్లోనే మాట్లాడుకుంటున్న పరిస్థితి వచ్చిందంటే అసలేం జరుగుతోందనేది అధిష్టానానికి అంతుచిక్కడం లేదట.
ఎమ్మెల్యేలపై గ్రిప్ తగ్గుతోందా?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలైంది. పరిపాలన ఎలా ఉందని చూడటానికి ఇది చిన్న సమయమే కావొచ్చు కానీ, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, మరికొందరు మంత్రులు గాడి తప్పుతున్నారన్న వాదన రోజురోజుకూ బలపడుతోంది. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉంటారు. ‘ జాగ్రత్తగా ఉండండి.. తేడా వస్తే మామూలుగా ఉండదు’ అని ముఖ్యమంత్రి సభలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా హెచ్చరిస్తున్నారు.
Also read: AP Weather Update: ఏపీకి పట్టిన వాన.. ఆ జిల్లాలలో అలర్ట్..
మరికొందర్ని సీఎంవోకు పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు. అయినా సరే ఆయా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఒక్క శాతం కూడా మార్పు రాలేదట. దీంతో పలువురి ఎమ్మెల్యేల తీరు ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నట్లుగా ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ఐదోసారి ముఖ్యమంత్రి అయిన పెద్దాయన ఎమ్మెల్యేలు, మంత్రుల మీద గ్రిప్ పెంచుకోలేకపోవడం ఏమిటి? ఆయన చెప్పినా ఎందుకు నేతలు ఎందుకు లెక్కచేయట్లేదు? ఎందుకిలా పట్టు జారుతోంది? అని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటికి రావడంతో ఎంత రచ్చ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, అరవింద్ బాబు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చెప్పుకుంటూ పదుల సంఖ్యలో ఉన్నారు. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ లాంటి వారు అలాగే తయారయ్యారు. ఈ మధ్యనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వర్మపై వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇలా రెండ్రోజులకోసారి ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంటోంది.
హెచ్చరికలు సరే చర్యలేవీ?
వాస్తవానికి పైన చెప్పిన జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికీ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అబ్బే హెచ్చరించారంతే కదా? ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ ఎమ్మెల్యేలు అనుకున్నారేమో కానీ, మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఓ వైపు వీరి వ్యవహారాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే.. మరోవైపు ఇవే వైసీపీకి ప్రధాన అస్త్రాలుగా మారాయి. దీంతో నిత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఎమ్మెల్యే లేదా ద్వితియ శ్రేణి నేతలు, కార్యకర్త వ్యవహారం తీరుపై మీడియా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అందుకే ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై గట్టిగా చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్లంతా దెబ్బకు సెట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
వాస్తవానికి చంద్రబాబు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఇది తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు. అలాంటిది ఎందుకో ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వ్యవహార శైలి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదని ఇలా ఉన్నారో, లేదంటే ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి కాబట్టి కాస్త సమయం తీసుకుంటున్నారో తెలియట్లేదు.
ముఖ్యమంత్రి మౌనాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్, భూముల ఆక్రమణ, బెదిరింపులు, వాటాలు ఇలా రకరకాలు వ్యవహారాల్లో తరచూ వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. వారి వారి పనుల్లో అక్రమ, అవినీతి సంపదలో బిజీబిజీగా ఉండిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం కార్యకర్తల బాగోగులను కూడా పట్టించుకోవడానికి సమయం కేటాయించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆరుగురు ఎమ్మెల్యేలు అలక.. త్వరలోనే?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆరుగురు ఎమ్మెల్యేలు అలకబూనినట్లుగా తెలుస్తున్నది. ఇందుకు కారణం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవుల నియామకమేనట. తమను ఏ మాత్రం ఒక్కమాట కూడా అడగకుండానే నియామకాలు జరిగాయని అసంతృప్తితో రగిలిపోతున్నారట. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఏమాత్రం సంప్రదించకుండానే ఉండి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు టీడీపీ వారికి కాకుండా జనసేనకు ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నారట. దీంతో రఘురామను సీఎం లైట్ తీసుకున్నారనే చర్చ సాగుతోంది.
Also read: Adavi Thalli Bata: అడవి బాట పట్టిన పవనన్న.. కారణం ఇదేనా?
ఇదే విషయంలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో చెప్పకుండానే నియామకాలు జరగడంతో అధిష్టానంపై అసంతృప్తి, అసహనంతో ఉన్నారట. వీరిలో ఒకరిద్దరు రాజీనామా చేస్తామని కూడా బెదిరిస్తున్నారని తెలిసింది. అయితే నామినేటెడ్ పోస్టుల కోసం నాలుగు పేర్లు పంపమని సీఎంవో నుంచి ఫోన్లు చేసినా, సీఎం నేరుగా చెప్పినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులు, కొందరు మాజీలను సరైన సమయం చూసి కొట్టాలని, దెబ్బపడితే మరోసారి ఇలాంటి పనులు చేయడానికి ఎవ్వరూ సాహసించకూడదనేలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది.
ఏడాది కాకమునుపే చర్యలు తీసుకుంటే బాగోదని, కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. అధినేత తీసుకునే కఠిన చర్యలు ఊహించని రీతిలో ఉండబోతున్నాయని మరికొందరు చంద్రబాబు ఆప్తులు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే కొందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు గట్టిగానే మూడినట్లే అన్నమాట.