AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో ఎండ దుమ్ములేపుతోంది. ఈ క్రమంలో అమరావతి వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో మరో 4 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే పలు ప్రాంతాల్లో మూడ్రోజులుగా అకాల వర్షాలు, పిడుగులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. వర్షంతో పాటు ఇవాళ కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగనున్నాయి. కాగా, ఆదివారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడ్డాయి.
Also read: Adavi Thalli Bata: అడవి బాట పట్టిన పవనన్న.. కారణం ఇదేనా?
ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. ఈ ఐదురోజుల పాటు వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
జాగ్రత్తగా ఉండండి..
మరోవైపు శనివారం రాత్రి కాకినాడ జిల్లా వేలంకలో 56.2మి.మీ, ఏలేశ్వరంలో48.5, కోటనందూరులో 45.2, అనకాపల్లి నర్సీపట్నంలో 44.5మి.మీ, అలాగే 33 ప్రాంతాల్లో 20మి.మీకు పైగా వర్షపాతం రికార్ట్ అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం రాయలసీమలో 40-42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39-41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.