Deputy CM Pawan Kalyan: గ్రేటర్ పరిధిలోని ట్రై సిటీల్లోని సర్కారు ఆస్తులను కాపాడుతున్న హైడ్రా లాంటి వ్యవస్థ అన్ని రాష్టాలకు అవసరమని ఆంధప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అభిప్రాయపడ్డారు. ఓ వివాహ వేడుకకు విజయవాడ వెళ్లిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ అవసరమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థ
పాలకుల ముందు చూపు నిబద్ధత గల అధికారుల పని తీరు ఏ వ్యవస్థకైనా మంచి పేరు తీసుకువస్తాయన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. కొత్త వ్యవస్థను తీసుకురావడమే గాకా, సరైన అధికారిని నియమించడం, అధికారాలు కట్టపెట్టడం, పూర్తి స్వేచ్ఛతో పని చేసే అవకాశం కల్పించడం జరిగితే ఫలితాలు బాగుంటాయని పవన్ వ్యాఖ్యానించారు. ఎంతో నిబద్ధతతో పని చేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు.
Also Read: Deputy CM Pawan Kalyan: అమరావతి సభలో పవన్ కీలక హామీ..హోరెత్తిన సభ.. ఏమన్నారంటే?
కబ్జా నుంచి పార్కు స్థలానికి విముక్తి .. రూ.30 కోట్లు విలువ భూమి కాపాడిన హైడ్రా
కబ్జాల బారిన చిక్కుకున్న మరో పార్కుకు హైడ్రా విముక్తి కల్గించింది. పార్కును కబ్జా చేసి బై నంబర్లు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. కొండాపూర్ లాంటి ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 2 వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా శుక్రవారం కాపాడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని రాఘవేంద్ర కాలనీలో పార్కుతో పాటు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గజాలను లే ఔట్‌లో చూపించారు. పార్కు స్థలం ఖాళీగా కనిపించడంతో అక్కడ కొంతమంది కబ్జాకు ప్రయత్నించారు. బై నంబర్లు సృష్టించి 10 ప్లాట్లుగా విభిజించినట్లు హైడ్రా వెల్లడించింది.
హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు
ప్రతి ప్లాట్‌లో ఒక షెడ్డు వేశారు. ఈ విషయమై రాఘవేంద్ర కాలనీ సీ బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధుల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించారు. పార్కుతో పాటు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణలను శుక్రవారం తొలగించారు. ఆ వెంటనే ఫెన్సింగ్ వేసి పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలం విలువ దాదాపు రూ. 30 కోట్ల వరకూ ఉంటుందని పేర్కొన్నారు.
హైకోర్టు ఆర్డర్‌తో ఆగిన అనుమతులు
200ల గజాల చొప్పున 10 ప్లాట్లుగా బై నంబర్లు సృష్టించి కబ్జా చేయడమే కాకుండా,వాటిని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. భవన నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇంతలో హైకోర్టు ఆదేశాలతో భవన నిర్మాణ అనుమతులను జీహెచ్ఎంసీ వెనక్కి తీసుకుంది. అలాగే రెగ్యులరైజేషన్‌ను కూడా రద్దు చేసినట్లు హైడ్రా వెల్లడించింది.
Also Read: Deputy CM Pawan Kalyan: కండను కరిగించడమే నిజమైన శ్రమ.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
