Ananthapur Fraud: సాధారణంగా దొంగలకు పోలీసులు అంటే మహా భయం. వారు కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడతారు. ఎక్కడ లాకప్ లో వేస్తారేమోనని తెగ హడలి పోతుంటారు. వీలైనంత వరకూ పోలీసుల సంచారం లేని ప్రాంతాల్లో దోపిడీలు దొంగతనాలు చేస్తుంటారు. అయితే కొందరు దొంగలు ఏకంగా పోలీసు పేరును అడ్డుపెట్టుకొని దోచేశారు. తద్వారా కొత్త తరహా మోసానికి తెరలేపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ఏపీలోని అనంతపురంలో నయా మోసం వెలుగు చూసింది. కొందరు దుండగులు ఓ కిరాణా షాపుకు వెళ్లారు. తమకు కావాల్సిన సరుకులు అడిగి మరి కట్టించుకున్నారు. దీంతో యజమాని డబ్బు ఇవ్వాలని కోరారు. అయితే ఇక్కడే దొంగలు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ సరుకులు తమకోసం కాదంటూ పేర్కొన్నారు. కారులో టూ టౌన్ సీఐ ఉన్నారని ఆయన కోసం కట్టించినవని చెప్పారు. కారులో పెట్టి డబ్బు తీసుకొని వస్తామని చెప్పడంతో కిరాణా స్టోర్ యజమాని నమ్మి పంపించారు.
సరుకులతో పరార్
కిరాణా సరుకులను కారు పెట్టేందుకు వెళ్లిన దుండగులు అటు నుంచి అటే పరారయ్యారు. మోస పోయానని గ్రహించిన షాపు యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగినదంతా వాళ్లకు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: SSC 10th Results: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా పొందండి!
దొంగలు అరెస్ట్
దర్యాప్తులో భాగంగా అనంతపురం పోలీసులు.. షాపు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. వాటి సాయంతో నిందితులను, వారు తీసుకొచ్చిన కారును గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మెుత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.