SSC 10th Results: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రిజల్ట్స్ ను స్వయంగా విడుదల చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి (Ravindra Bharathi)లో ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం.. అక్కడే ఫలితాలను రిలీజ్ చేశారు. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్ విజయవాడ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఫలితాల విడుదల కాస్త ఆలస్యమైంది.
19 కేంద్రాల్లో మూల్యంకనం
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకూ మూల్యాంకన ప్రక్రియ నిర్వహించారు. అనంతరం వాటిని కంప్యూటీకరణ చేసి తాజాగా విడుదల చేశారు. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఈ సంధర్భంగా సీఎం ప్రకటించారు.
ఈసారి మార్కులతో
పదో తరగతి ఫలితాలను ఇప్పటివరకూ సబ్జెక్ట్ ల వారీగా గ్రేడ్లతో ఇచ్చారు. అయితే ఈసారి గ్రేడ్లతో పాటు మార్కులను సైతం విడుదల చేయడం విశేషం. రిజల్స్ట్ మెమోలో సజ్జెక్ట్స్ వారీగా మార్క్స్ ముద్రించడంతో పాటు ఆ స్కోరు తగ్గట్లు గ్రేడ్ ను కూడా కేటాయించారు. ఆ విద్యార్థి పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అన్న విషయాన్ని కూడా స్పష్టంగా మెమోలో తెలియజేశారు.
మార్క్స్ ఇలా పొందండి
పదో తరగతి విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని వెబ్ సైట్స్ ను సూచించింది. bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లేదా https://results.bsetelangana.org అధికారిక వెబ్ సైట్స్ లోకి వెళ్లి మార్క్ చూసుకోవచ్చు. పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ తదితర వివరాలను పొందుపరిచి సబ్మిట్ చేస్తే వెంటనే మార్కులతో కూడిన మెమో వస్తుంది.
బాలికలదే హవా
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 92.78% మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఫలితాల్లో బాలికలే మళ్లీ సత్తా చాటినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే 99.29 % ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 99.09 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి రెండో స్థానం దక్కించుకుంది. చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా 73.97% తో నిలిచింది. ఇదిలా ఉంటే జూన్ 3 నుంచి 13వ తేదీ వరకూ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ మెుదలుకానుంది.
గ్రేడ్ల కేటాయింపు ఇలా
పదో తరగతి ఫలితాల్లో మార్కులతో పాటు గ్రేడ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గ్రేడ్లు ఏ విధంగా ఇచ్చారన్న దానిపై కొందరు విద్యార్థుల్లో గందరగోళం ఉంది. పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా 91-100 మార్కులు సాధించిన వారికి A1 గ్రేడ్ ఇస్తారు. 81-90మార్కులకు A2, 71-80 మార్కులకు B1, 61-70 మార్కులకు B2, 51-60 మార్కులకు C1, 41-50 మార్కులకు C2, 35-40 మార్కులకు D గ్రేడ్ గా కేటాయిస్తారు. ఫెయిల్ అయితే గ్రేడ్ లభించదు.