Alluri District heatwave alert: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం (30-03-25) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల ప్రభావం ఉన్న మండలాల జాబితా విడుదలైంది. రేపు 126 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించనుంది. శ్రీకాకుళం జిల్లాలో 20, విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలో 13, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 1, అనకాపల్లి జిల్లాలో 11, కాకినాడ జిల్లాలో 7, కోనసీమ జిల్లాలో 7, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, ఏలూరు జిల్లాలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2, పల్నాడు జిల్లాలో 2 మండలాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. సోమవారం రెండు మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 15 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు.
Also Read: తెలంగాణలో రెపరెపలాడిన .. టీడీపీ జెండా
శనివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.7 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లా రుద్రవరం, ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 43.5 డిగ్రీల సెల్సియస్, అన్నమయ్య జిల్లా వతలూరులో 42.7 డిగ్రీల సెల్సియస్, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.4 డిగ్రీల సెల్సియస్, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.2 డిగ్రీల సెల్సియస్, విజయనగరం జిల్లా గుర్లలో 42.1 డిగ్రీల సెల్సియస్, తిరుపతి జిల్లా గూడూరులో 41.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ రోజు 96 ప్రాంతాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 27 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 103 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఓ వైపు అంతిమ యాత్ర.. మరోవైపు పరుగులు.. అసలేం జరిగిందంటే?
వడగాలుల ప్రభావం దృష్ట్యా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ, కర్చీఫ్ లేదా గొడుగు వాడాలి. వేడిగాలి ప్రభావం తగ్గించేందుకు నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమ అధికంగా అవసరమయ్యే పనులను మధ్యాహ్నం చేసేలా జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వ సూచనలు పాటించడం ద్వారా వడగాలుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.