Alluri Sitharama Raju District: మనిషి చనిపోతే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం పాటు తమతో పెనవేసుకున్న బంధం.. ఒక్కసారిగా దూరమైతే ఆ విషాధాన్ని వర్ణించడం అంత సులువేం కాదు. ఈ క్రమంలోనే చనిపోయిన వ్యక్తితో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఘనంగా వారిని చితి వరకూ సాగనంపుతుంటారు. పూలు చల్లుతూ, బాణసంచా పేలుస్తూ వారిని ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లూరి జిల్లాలో జరిగిన అంతిమయాత్రలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పక్కన పడేసి బంధువులు తలోదిక్కు పరిగెత్తారు.
వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని అల్లూరి జిల్లా (Alluri Sitharama Raju District) గన్నేరు కొయ్యపాడు గ్రామంలో కొప్పుల పల్లాయమ్మ (86) అనే మహిళ వృద్దాప్య సమస్యలతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమపై ఇన్నేళ్లుగా ప్రేమానురాగాలు కురిపిస్తూ వచ్చిన కుటుంబ పెద్ద ఒక్కసారిగా దూరం కావడంతో కన్నీరు మున్నీరయ్యారు. తమ కోసం జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పల్లాయమ్మ అంతిమ యాత్రను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
తేనేటీగల దాడి
ఈ క్రమంలోనే పల్లాయమ్మ అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు. మృతదేహంపై చల్లేందుకు పెద్ద ఎత్తున పూలు.. పేల్చేందుకు బాణాసంచాను తీసుకొచ్చారు. అనంతరం
టపాసులు పేలుస్తూ అంతిమయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ చెట్టు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు.. మరోమారు బాణాసంచా కాల్చారు. అయితే ఆ చెట్టుపై తేనేటీగలు ఉన్న విషయాన్ని వారు గమనించలేదు. బాణాసంచా ధాటికి ఒక్కసారిగా తేనేటీగలు చెదిరిపోయాయి. అంతిమయాత్రలో పాల్గొన్న బంధువులపై ఒక్కసారిగా దాడి చేశాయి.
తలోదిక్కు పరుగు
తేనేటీగల దాడితో అంతిమయాత్రలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని అక్కడే వదిలి బంధువులు తలోదిక్కు పరిగెత్తారు. అప్పటివరకూ బంధుగణం, డప్పులు, పూల వర్షంతో ఉన్న పాపయమ్మ మృతదేహం.. ఒక్కసారిగా అనాథగా మారిపోయింది. తేనేటీగలు వెనక్కి తగ్గిన తర్వాత తిరిగి అంతిమ యాత్రను కుటుంబ సభ్యులు ప్రారంభించారు. పాపయమ్మకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కరాలు నిర్వహించారు.
Also Read: Telangana BJP: బిజెపిలో అయోమయం.. రోజుకో పేరు తెరపైకి.. ఇంతకు ‘చీఫ్’ ఎవరు?
ఐసీయూలో నలుగురు
అయితే తేనేటీగల దాడిలో దాదాపు 40మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గౌరీదేవి పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వెంటనే చికిత్స అందించారు. వారిలో నలుగురు పరిస్థితి దారుణంగా మారడంతో భద్రాచంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుల పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తేనేటీగలతో జాగ్రత్త
అయితే తేనేటీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటి పరిసరాల్లోకి వెళ్లి తేనేటీగలకు ఇబ్బందులు సృష్టిస్తే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. తేనేటీగల దాడి ఒక్కోసారి ప్రాణాంతం కూడా కావొచ్చని చెబుతున్నారు. కాబట్టి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చెట్ల గుండా అంతిమయాత్ర నిర్వహించేటప్పుడు మరింత అప్రమత్తత అవసరమని స్పష్టం చేస్తున్నారు.