Andhra Pradesh: అవును.. ఈ ఫొటో, వీడియోలు చూసిన తర్వాత అయ్యో.. దేవుడా.. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా? అనిపిస్తుందేమో. ఇప్పుడీ ఘటనే మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చనీయాంశమైంది. ఎక్కడా ఎలాంటి అవినీతికి పాల్పడొద్దని, ఎవర్నీ ఇబ్బంది పెట్టొద్దని కార్యకర్తలు మొదలుకుని మంత్రుల వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతూనే వస్తున్నప్పటికీ.. కొందరు ద్వితియ శ్రేణి నేతలు, కార్యకర్తలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ విర్రవీగుతున్నారని ఆయా పార్టీల వాళ్లే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడ, ఎంత పెద్దవాళ్లయినా, ఆఖరికి సొంత పార్టీ వాళ్లు అయినా సరే డబ్బులు డిమాండ్ చేయడం టీడీపీ, జనసేన నేతలకు పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి ఘటనలు లెక్కలేనన్నే చోటుచేసుకున్నాయి. బహుశా ఇలాంటి దారుణ ఘటన ఎక్కడా చూసి ఉండరేమో. ఈ వార్త చదివితే చాలు ఆవేదన, బావోద్వేగం ఆటోమాటిక్‌గా వచ్చేస్తాయి అంతే..
Read Also- YSRCP: సీన్ రివర్స్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి..
అసలేం జరిగింది?
ఇంటి స్థలం విషయంలో తనకు న్యాయం చేయాలని అధికారులను భువనేశ్వరి అనే యువతి వేడుకుంటున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో జరిగింది. అనాథను అయిన తనకు తలకటూరులో ఇంటి స్థలానికి అనుమతి ఉన్నా.. కొందరు నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని యువతి వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ‘మీకోసం’ కార్యక్రమానికి వచ్చారు. తన చెవి దిద్దులు తీసి టేబుల్‌పైన పెట్టిన భువనేశ్వరి, ఇవి తీసుకొని తనకు న్యాయం చేయాలని కలెక్టర్, అధికారులను వేడుకున్నారు. అంతేకాదు.. కోర్టు తీర్పు ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఎదురుగా ఉన్న అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ‘ఇలా చేయడం సరికాదమ్మా.. మీకు న్యాయం చేసే బాధ్యత మాది’ అని భువనేశ్వరికి అధికారులు నచ్చజెప్పారు. ఆఫీసర్ల భరోసాతో కాసింత హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సన్నివేశంతో ‘మీకోసం’ కార్యక్రమానికి వచ్చిన జనాలు అంతా ఒకింత కంగుతిన్నారు. వారంతా కూడా ఇలాంటి వారికి న్యాయం చేసి పుణ్యం కట్టుకోండమ్మా అంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
నాకు న్యాయం కావాలి..!
కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈసారైనా అధికారులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘ మా ముత్తాతల నుంచి వచ్చిన ఇంటి స్థలంలో కొందరు దౌర్జన్యం చేస్తున్నారు. కోర్టుకు వెళ్లగా.. మా తాతకే వర్తిస్తుందని తీర్పు కూడా వచ్చింది. ఇప్పుడు అది మా స్థలం అయినప్పటికీ కొందరు దౌర్జన్యంగా ఇల్లు కట్టారు. ఎందుకిలా చేస్తున్నారు? అని అడిగితే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామ పెద్దలు, స్థానిక రాజకీయ నాయకులు ఎవరికి డబ్బు ఉంటే వారి వైపే మాట్లాడుతున్నారు. అధికారుల దగ్గరికి పలుమార్లు వెళ్లి నాకు న్యాయం చేయండి మహాప్రభో అని చేతులెత్తి వేడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇంతకుమించి ఆ పెద్దలు, నాయకులతో కొట్లాడటానికి శక్తి, డబ్బులు నా దగ్గర లేవు. అందుకే నా చెవి దిద్దులు అధికారులకు ఇవ్వబోయాను. నేను అనాథను. నాకు మా తాతయ్య తప్ప ఎవరూ లేరే. ఆయనకూ నేను ఒక్కదాన్నే దిక్కు’ అని మీడియా ఎదుటే భువనేశ్వరి కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఏపీ ఎటు వెళ్తోంది? పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారికి కూడా న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం ఉండి కూడా ఏం ఫలితం? అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంటే పేదల పక్షం, పేదల కోసమే ప్రభుత్వం అని చెప్పే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ యువతికి సంబంధించిన భూమిని లాక్కున్నదెవరు? ఏ పార్టీ అనేది ఇక్కడ అనవసరం.. యువతికి న్యాయం చేస్తే మంచిది.
Read Also- Hyderabad: ఓరి నీ దుంపతెగ.. మహిళ ‘వేలు’ చూపించిందని కొరికేశాడు!