అమరావతి, స్వేచ్ఛ: PM Modi AP Visit: రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిధులకు ఆమోదముద్రపడడంతో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అనుమతులు దక్కిన వెంటనే మిషన్ మోడ్‌లో శరవేగంగా పనులను కొనసాగించాలని యోచిస్తోంది.
అమరావతిలో నవనగరాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూటమి ప్రభుత్వం రాజధానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 15 లేదా 20 తేదీన ఆయన అమరావతి రానున్నారని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. నవనగరాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్టు తెలిసింది. ఏప్రిల్ రెండవ వారంలోగా ప్రధాని షెడ్యూల్ ఖరారయ్యే సూచనలు ఉన్నాయి. అయితే, మోదీ రాకను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండదండలు అందిస్తు్న్న నేపథ్యంలో మోదీ చేతుల మీదుగానే పునర్నిర్మాణ పనులను మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
నిజానికి 2014లో టీడీపీ-బీజేపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకోవడం, ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి పనులు మరుగునపడ్డాయి.
ఎక్కడ పనులు అక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది డిసెంబర్‌లో పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించించింది. మరికొన్ని రోజుల్లోనే పనులు మొదలుపెట్టబోతోంది.
20 నుంచి పనులు మొదలు!
అమరావతి పునర్నిర్మాణ పనులను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సాంకేతిక అవాంతరాల తొలగిపోయిన తర్వాత ఈ మధ్యే టెండర్లను ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను త్వరలోనే జారీ చేయనున్నట్టు సమాచారం.
మంగళవారం (మార్చి 17) రాష్ట్ర కేబినెట్ భేటీలో రాజధాని పనులకు ఆమోదం తెలిపి, ఆ తర్వాత కాంట్రాక్టు ఏజెన్సీలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’లను జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. మొత్తం రూ. 37,702 కోట్ల విలువైన పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను జారీ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, అంటే ఈ నెల 20 నుంచి పనులను ప్రభుత్వం మొదలుపెట్టనుంది. మరోవైపు, గృహ నిర్మాణ పనులు కూడా జోరుగా జరగనున్నాయి.
పనులకు సీఆర్డీఏ అనుమతి
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా 2 రోజుల క్రితమే దాదాపు రూ.37,702 కోట్లు విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’లు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ భేటీలో నిర్ణయించారు.
ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ రెండు బ్యాంకులు కలిపి సుమారు రూ.13,400 కోట్ల మేర రుణాలు ఇవ్వనున్నాయి. మరోవైపు, హడ్కో నుంచి రూ.11వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఈ రుణ సేకరణలో కీలకమైన అడుగులు కూడా పడ్డాయి.
జర్మనీకి చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5 వేల కోట్ల రుణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వనుంది. మొత్తంగా పెద్ద సంఖ్యలో నిధులతో అమరావతి పునర్మిర్మాణ పనులు మొదలు కానున్నాయి.
9 కాంట్రాక్టు సంస్థలు టెండర్లు
రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణ పనులు చేపట్టేందుకు మొత్తం తొమ్మిది సంస్థలు వేర్వేరు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నాయి. గత టీడీపీ హయాంలో సగానికి పైగా పూర్తైన పలు బిల్డింగులు, రాజధాని పరిధిలోని రోడ్లు, కాలువలు, మురుగునీటి వ్యవస్థ నిర్మాణం, రోడ్లకు ఇరువైపులా సైకిలింగ్ ట్రాక్‌లు, మౌలిక సదుపాయాలతో పలు ముఖ్యమైన పనుల కాంట్రాక్టులను ఆయా కంపెనలు దక్కించుకున్నాయి.
Also Read: CM Chandrababu: చంద్రబాబు స్పెషల్ క్లాస్.. పార్టీలో మార్పు వచ్చేనా?
కాంట్రాక్టులు పొందిన సంస్థల జాబితాలో ఎల్‌అండ్ టీ, బీఎస్ఆర్ ఇన్‌ఫ్రాతో పాటు పలు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. 17న కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే సంస్థలకు పనులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. పనులకు అనుమతులు ఇచ్చిన తొమ్మిది నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ కాలపరిమితి విధించింది.