Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా తుది అంకానికి చేరువైంది. బుధవారంతో ఈ మహాస్నాన ఘట్టం పరిసమాప్తం కానుంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా జన జాతర 46 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగి బుధవారంతో ముగియనుంది. ఆదివారం (ఫిబ్రవరి 23) నాటికి ఏకంగా 62 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించగా, చివరి రెండు రోజుల్లో ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే రైళ్లలో భారీగా రద్దీ నెలకొంది. అందుకు అనుగుణంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మూడు నదుల కలయిక అయిన త్రివేణి సంగమంతో పాటు సున్నితమైన ఇతర ప్రాంతాలు, స్నాన ఘట్టాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు.
శివరాత్రికి ఫుల్ రష్
మహా శివరాత్రికి జరిగే ఈ స్నానాలను ‘షాహీ స్నాన్’ (రాయల్ బాత్స్) అని పిలుస్తారు. ఆధ్యాత్మిక ప్రత్యేకత ఉందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్‌లో రద్దీ పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్‌లో ఏకంగా 350 మంది అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్టు మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. చివరి స్నానమైన మహా శివరాత్రి రోజు అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఆయన వివరించారు.
చివరి రోజు మూహూర్తాలు ఇవే
ఫిబ్రవరి 26న మహా కుంభమేళా మహా స్నానఘట్టం ముగియనుంది. ఆ రోజున, బ్రహ్మ ముహూర్తం ఉదయం 05:09 గంటలకు మొదలై 06:59 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 6:16 గంటల నుంచి 6:42 గంటల వరకు, నిషిత ముహూర్తం అర్ధరాత్రి 12:09 గంటలకు 12:59 గంటలకు ముగియనుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరోవైపు, శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26 ఉదయం 11:08 గంటలకు ఆరంభమై మరుసటి రోజు (ఫిబ్రవరి 27) ఉదయం 8:54 గంటలకు ముగియనుంది.
కుంభమేళాకు ఇక రాకండి
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్‌లో ఎడతెగని భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. 44 రోజుల నుంచి నిరంతరాయంగా భక్తుల వెల్లువ కొనసాగుతున్నది. అయితే, నిత్యం రద్దీతో కూడిన ఈ పరిస్థితి తమకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు కొందరు వాపోతున్నారు. ఎడతెగని భక్తుల ప్రవాహం తమ దైనందిన జీవితాలకు ఆటంకం కలిగిస్తున్నదని కొందరు బహిరంగంగా వాపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ‘రెడ్డిట్’లో స్థానిక వ్యక్తి ఒకరు ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. సందర్శకులు ప్రయాగ్ రాజ్ రావడం మానేయాలని కోరాడు. ‘మా వ్యథలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకుల రద్దీ కారణంగా మా దైనందిన జీవితం గడవడం కూడా కష్టంగా మారింది’ అని సదరు నెటిజన్ పేర్కొన్నాడు. మహా కుంభమేళా కారణంగా గతేడాదితో పోల్చితే ప్రయాగ్ రాజ్ బాగా మారిపోయిందని పేర్కొన్నాడు. కొత్త రోడ్లు, ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ నియంత్రణ మెరుగైందని, అయితే, ఇక అలసిపోయామని అతడు చెప్పాడు.
Read Also: Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’.. ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఎలా ఉందంటే..