Hari Hara Veera Mallu Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. నిర్మాత ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన పాట ‘మాట వినాలి’ విడుదలై చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సోమవారం ఈ సినిమా నుండి రెండో సాంగ్ ‘కొల్లగొట్టినాదిరో’ లిరికల్‌ని మేకర్స్ విడుదల చేశారు. రెండు రోజుల క్రితం ఈ ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ప్రోమో విడుదలై, పాటపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఈ అంచనాలను రీచ్ అయ్యేలా పాట ఉండటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read- Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?
ఈ పాట ఎలా ఉందంటే.. ‘కొల్లగొట్టినాదిరో’ పాటను గ్రాండియర్‌గా తెరకెక్కించినట్లుగా విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్, హీరో నిధి అగర్వాల్‌తో పాటు అనసూయ, పూజిత పొన్నాడ స్పెషల్ అట్రాక్షన్‌గా దర్శనమిచ్చారు. ప్రోమోలోనే వారిద్దరికీ చోటిచ్చి ఆశ్చర్యపరిచిన మేకర్స్, ఫుల్ సాంగ్‌లోనూ వారిని భాగం చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్‌ల స్క్రీన్ ప్రజెన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆస్కార్ విజేత కీరవాణి స్వరపరిచిన ఈ పాట సంగీత ప్రియులను అలరించేలా ఉంది. బహుళ భాషల్లో విడుదలైన ఈ పాటను మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ వంటి వారు ఆలపించారు. తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా ఈ పాటకు సాహిత్యం అందించారు. పాట వినగానే చార్ట్ బస్టర్ ఫీల్ ఇస్తున్న ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగా బిజీ కావడంతో, షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగిలిన పార్ట్ షూటింగ్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. మొదటిసారి పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందనేలా వార్తలు రాగా, వెంటనే నిర్మాత రత్నం ఖండించారు. ‘హరి హర వీరమల్లు’ను చెప్పిన డేట్‌కు థియేటర్లలో దించుతామని ఆయన నమ్మకంగా చెప్పారు.