- స్వచ్ఛ ఆటో టిప్పర్ల అత్యుత్సాహం వల్లే అక్రమంగా బల్క్ చెత్తను సేకరిస్తున్న కార్మికులు
- అధికారుల ఆదేశాలను ఖాతరు చేయని వైనం
- డైలీ 2 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
- దీంతో రాంకీ సంస్థకు నష్టం
- ఏటా బల్క్ ఛార్జీల కింద బల్దియా కోట్ల చెల్లింపులు
GHMC: స్తోమతకు మించి అప్పులు చేసి, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీపై మరో అదనపు ఆర్థిక భారం పడింది. నిధుల సమీకరణ కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న బల్దియా ఖజానా ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డోర్ టూ డోర్ చెత్త సేకరణ వేగంగా జరగాలన్న సంకల్పంతో జీహెచ్ఎంసీ సమకూర్చిన స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఇప్పుడు బల్దియాకు నష్టాన్ని తెచ్చిపట్టేలా తయారయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరుగైన పారిశుధ్యం కోసం 2012 లో రాంకీ ఎన్విరో సంస్థ, జీహెచ్ఎంసీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం డొమెస్టిక్ చెత్త కాకుండా కమర్షియల్ వ్యాపార సముదాయాల నుంచి సేకరించాల్సిన బల్క్ చెత్తను స్వచ్ఛ టిప్పర్ కార్మికులు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా సేకరిస్తున్నారు. దీంతో ఖజానాకు అదనపు భారంగా మారింది. 2012లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి రోజు 7 వేల మెట్రిక్ టన్నుల చెత్తకు ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.1431 చొప్పున చెల్లిస్తూ వస్తున్న జీహెచ్ఎంసీ, ప్రతి ఏటా 5శాతం పెంచుతూ ప్రస్తుతం రూ.2 వేల పై చిలుకు ఒక్కో మెట్రిక్ టన్నుకు రాంకీకి చెల్లిస్తున్నది. తాము సేకరించాల్సిన బల్క్ చెత్తను స్వచ్ఛ టిప్పర్ ఆటో కార్మికులు నగరంలోని వ్యాపార సంస్థల నుంచి రోజుకు సుమారు రెండు వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారని, తద్వారా తమకు ఏటా రూ.165 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు రాంకీ సంస్థ క్లెయిమ్ చేస్తున్నది. దీంతో కార్మికులను కంట్రోల్ చేయలేని జీహెచ్ఎంసీ అధికారులు రాంకీకి ఏటా రూ.165 కోట్లను జీహెచ్ఎంసీ ఖజానా నుంచి చెల్లిస్తున్నట్లు సమాచారం.
కార్మికుల అసలు విధులేంటి?
స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు తాము నిర్వర్తించాల్సిన విధులను పక్కనబెట్టి కమర్షియల్ చెత్త సేకరణకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు జీహెచ్ఎంసీ దశల వారీగా 3750 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చి, వాటికీ కార్మికులను నియమించింది. కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో 3200 ఆటో టిప్పర్లు మాత్రమే చెత్తను సేకరిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు సార్లు, మరి కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి మాత్రమే చెత్తను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక నాలుగైదు అంతస్తులున్న అపార్ట్ మెంట్‌లోని కుటుంబాల నుంచి నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తూ చెత్తను సేకరిస్తున్నట్లు తెలిసింది. టిప్పర్ల ఈఎంఐలను మాత్రమే చెల్లిస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులకు ఒక్కో ఇంటికి రూ.50 చెల్లించాలని గతంలోనే జీహెచ్ ఎంసీఆదేశాలు జారీ చేసింది. కానీ కార్మికులు వందల్లో, వేలల్లో డిమాండ్ చేస్తూ ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంతటితో ఆగని కార్మికులు తమ ఏరియాల్లోని వ్యాపార సంస్థల నుంచి కూడా నెలకు వేలల్లో మాట్లాడుకుని చెత్తను సేకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
డోర్ టూ డోర్ సేకరణ విఫలం
నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటో టిప్పర్లు పూర్తిగా కమర్షియల్‌గా మారిపోవటంతో బస్తీలు, మురికివాడల నుంచి చెత్తసేకరణ జరగటం లేదని అధికారులు గుర్తించారు. మేయర్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్‌లోనూ చెత్త సేకరణ కోసం ఒక్కో ఇంటి నుంచి కార్మికులు ఏకంగా రూ. వెయ్యి డిమాండ్ చేయటంతో కౌన్సిల్ సమావేశాల్లో మేయర్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. చెత్త సేకరించాల్సిన స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు డిమాండ్ చేసినంత డబ్బు బస్తీలు, మురికివాడల ప్రజలు చెల్లించకపోవటంతో అక్కడ చెత్త సేకరణ జరగక, రోడ్లపై, కూడళ్లలో చెత్త వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.