Thorrur Municipality: పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మొత్తం 16 వార్డులకు గాను 144 నామినేషన్లు దాఖలవడంతో పట్టణ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల దాఖలుకు ఈరోజే ఆఖరి రోజు కావడంతో ఒక్కరోజులోనే 93 నామినేషన్లు దాఖలవడం విశేషం. మున్సిపల్ ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోటీలోకి దిగారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పార్టీ వారీగా నామినేషన్ల వివరాలు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 41 నామినేషన్లు దాఖలవగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధికంగా 51 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 32 నామినేషన్లు నమోదు కావడంతో ఆ పార్టీ కూడా అన్ని వార్డుల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా బీఎస్పీ నుంచి 3, సిపిఎం నుంచి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతర చిన్న పార్టీల నుంచి 4, స్వతంత్ర అభ్యర్థులుగా 8 నామినేషన్లు దాఖలయ్యాయి.
Also Read: Illegal Steroid Sale: సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్లు.. మృత్యు ముఖానికి చేరుతున్న యువకులు
చివరి రోజున ఊపందుకున్న నామినేషన్లు
నామినేషన్ల ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులతో మున్సిపల్ కార్యాలయం పరిసరాలు సందడిగా మారాయి. ర్యాలీలు, నినాదాలు, పార్టీ జెండాలతో వాతావరణం ఎన్నికల మయంగా మారింది. పలువురు వార్డుల్లో ఒకే పార్టీ నుంచి బహుళ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో అసమ్మతి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి.
గట్టి పోటీకి రంగం సిద్ధం
నామినేషన్ల సంఖ్యను బట్టి చూస్తే తొర్రూరు మున్సిపాలిటీలో ఈసారి త్రిముఖ పోటీ తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండగా, బీఆర్ఎస్ తిరిగి పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ కూడా పట్టణంలో తన ఉనికిని చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం అసలు పోటీ ఎలా ఉండబోతోందన్న దానిపై స్పష్టత రానుంది. మొత్తానికి తొర్రూరు మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా హోరాహోరీగా సాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: Pet Dog Attack: బెంగళూరులో దారుణం.. టెకీపై పెంపుడు శునకం దాడి.. ఎన్ని కుట్లు పడ్డాయో తెలిస్తే?

