Shashi Tharoor: చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనాయకత్వానికి దూరం పాటిస్తూ వస్తున్న ఆ పార్టీ సీనియర్ ఎంపీ శశిథరూర్‌పై(Shashi Tharoor) అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. బీజేపీకి చేరువవుతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) ప్రశంసించడం, మరోవైపు, హస్తం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలకు సైతం ఆయన ముఖం చాటేయడం ఈ విశ్లేషణలకు కారణమైంది. అయితే, ఈ ఊహాగానాలు అన్నింటికీ శశిథరూర్ చెక్ పెట్టారు. గురువారం పార్లమెంటులో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో (Malli Karjuna Kharghe) భేటీ అయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఈ భేటీతో పార్టీ నాయకత్వం, ఆయనకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ప్రచారానికి ఈ భేటీతో తెరపడినట్టు అయ్యింది. రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేలతో జరిగిన ఈ భేటీ సాధారణ మర్యాదపూర్వకమైనదని శశిథరూర్ పేర్కొన్నారు.
కాగా, పార్లమెంట్‌లోని రాహుల్ గాంధీ ఆఫీసులో ఈ సమావేశం జరిగింది. అరగంటకు పైగా మాట్లాడుకున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుధవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వంతో శశిథరూర్ భేటీ కావడంతో జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇందులో వింత ఏముంది?
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలవడానికి ముందు ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నాయకులను కలవడంలో వింతేముంది? అని మీడియా ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంపై మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను పార్లమెంటుకు వెళ్తున్నానని వివరించారు. రాహుల్ గాంధీ, ఖర్గేలతో భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
అంతా బాగానే ఉంది
కీలకమైన ఈ భేటీ తర్వాత ఎక్స్ వేదికగా ఎంపీ శశిథరూర్ స్పందించారు. భేటీకి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఆయన, పార్టీ నాయకత్వానికి, తనకు మధ్య అంతా బాగానే ఉందని ఆయన రాసుకొచ్చారు. ఇవాళ వివిధ అంశాలపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. దేశ ప్రజల సేవలో తామంతా ఒకే తాటిపై ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా, శశిథరూర్ తిరువనంతపురం ఎంపీగా ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారంటూ చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై పలుమార్లు మీడియా ప్రశ్నించగా, ఏదైనా ఉంటే పార్టీ నాయకత్వంతోనే సంప్రదింపులు జరుపుతానంటూ సమాధానం ఇచ్చారు. ఇవాళ జరిగిన భేటీతో ఊహాగానాలకు శశిథరూర్ తెరదించినట్టు అయ్యింది.

