Medaram Jatara: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం భక్తి పరవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘడియ సాయంత్రం ప్రారంభమవగా, కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుమార్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయి లతో పాటు గోవిందరాజుల పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు సాయంత్రం 7, గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు.
Also Read: Medaram Jatara: మేడారం మహా జాతర..పెళ్లి కుమారుడిగా ముస్తాబైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దె!
గద్దెల వద్ద ప్రత్యేక పూజలు
జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు, డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పరవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రాత్రి 12.30 గంటలకు గద్దెల ప్రాంతానికి చేరుకున్న సారలమ్మ అమ్మవారికి, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందరాజులు, పగిడిద్దారాజులతో కలిసి అర్ధరాత్రి గద్దెపైకి అమ్మవారు చేరుకున్నారు.
గోవిందరాజు లకు ప్రత్యేక పూజలు
ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు. ఈ ఘట్టానికి ముందు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌లు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం మధ్య రాత్రి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం మహా జాతరను సందర్శించి పరిశీలించారు. కన్నెపల్లి గ్రామస్తులతో మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లు ఆదివాసుల తో నృత్యాలు కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సంప్రదాయా నృత్యాల్లో పాల్గొని జాతర ఆధ్యాత్మికతను మరింత పెంచారు. దీంతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో తొలి కీలక ఘట్టం విజయవంతంగా పూర్తి కాగా, కొంగుబంగారు తల్లి శ్రీ సారలమ్మ గద్దెపై కొలువు తీరుతూ భక్తులకు దీవెనలు ఇస్తోంది. ఇక జాతరలోని తదుపరి ఘట్టాల కోసం భక్తజనం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
నేడు గద్దె పైకి సమ్మక్క
మేడారం జాతరలో బుధవారం ఓ కీలక ఘట్టం ఆవిష్కృతం కాగా, గురువారం అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. చిలకలగుట్ట నుంచి ఆదివాసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క ను పెద్ద పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతారు. ఈ క్రమంలో సమ్మక్క రాకకు గుర్తుగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆయుధంతో ఆకాశంలో కాల్పులు జరుపుతారు. దీంతో భక్తులంతా పులకిందులై సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తారు. సమ్మక్క గద్ద పైకి వచ్చాక ఆదివాసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో భక్తులు తమ మొక్కులను చెల్లించుకునేందుకు అవకాశం కలుగుతుంది. గురువారం వరకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న, నాగులమ్మలు వారి వారి గద్దెలపై నుండి భక్తులకు దర్శనం ఇస్తారు.\
శుక్రవారం ప్రత్యేక పూజలు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన 2026 ఏడాది మేడారం మహా జాతర లో శుక్రవారం వనదేవతలకు కోట్లాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం మొత్తం మేడారం జాతర పూర్తి కోలాహాలంగా మారడంతో పాటు, ఆ పరిసర ప్రాంతాలంతా రద్దీగా మారుతాయి. 1500 మంది పోలీసులతో పూర్తి బందోబస్తు చర్యలను పోలీసులు చేపడుతున్నారు. శుక్రవారం మొత్తం పూజలు నిర్వహించాక, శనివారం జనం నుంచి వనదేవతలు వనంలోకి ప్రవేశిస్తారు. దీంతో 2026 మేడారం మహా జాతర పూర్తి అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Also Read: Medaram Jatara 2026: మేడారం జాతర స్పెషల్.. 4,000 ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన

