Ajit Pawar Death: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సొంత నియోజకవర్గమైన బారమతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా విమానం కుప్పకూలి ఆయన కన్నుమూశారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ , ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
మహారాష్ట్ర బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా అనేక మంది మరణించారనే వార్త తీవ్ర బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అజిత్ పవార్ అకాల మరణం కోలుకోలేని నష్టంగా అభివర్ణించారు. మహారాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా సహకార రంగంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని ఎక్స్ లో పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం అజిత్ పవార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ గొప్ప ప్రజానాయకుడు అన్న మోదీ.. క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలు కలిగినేత ఆయనంటూ కొనియాడారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కోసం ఎల్లప్పుడు ముందు ఉండేవారని గుర్తుచేశారు. పరిపాలన విషయాలపై ఆయనకున్న అవగాహన ప్రశంసనీయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి..
అజిత్ పవార్ దుర్మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సైతం సంతాపం తెలియజేశారు. ఆయన మరణవార్త అంతులేని వేదనను కలిగించిందని పేర్కొన్నారు. ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉన్న ఒక నాయకుడిని అకారణంగా కోల్పోవడం బాధగా ఉందన్నారు. మహారాష్ట్ర ప్రజలకు వివిధ రాజ్యాంగ పదవులలో సేవలందించిన అజిత్ పవార్.. తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని చెప్పారు. పవార్ కుటుంబ సభ్యులు, ఆయన శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సైతం అజిత్ పవార్ మరణం పట్ల సంతాపం తెలియజేశారు. ఈ దుఃఖ సమయంలో పవార్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అటు ప్రియాంక గాంధీ సైతం అజిత్ పవార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సీఎం చంద్రబాబు స్పందన..
శరద్ పవార్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన అకాల మరణం తనను షాక్ కి గురిచేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అజిత్ పవార్ కుటుంబం, ఆయన మద్దతు దారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. అజిత్ పవార్ మరణం మహరాష్ట్రతో పాటు దేశానికే తీరని లోటని పేర్కొన్నారు. పవార్ కుటుంబ సభ్యుల్లో స్థైర్యాన్ని నింపాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Ajit Pawar Dies: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం.. డిప్యూటీ సీఎం దుర్మరణం
తెలంగాణ నేతలు సైతం..
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అజిత్ పవార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాలలో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగి ఇటీవలే ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలలో తీరని లోటని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పవార్ మరణవార్త తనను ఎంతగానో కలిచి వేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పవార్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాల్లో విశేష అనుభవమున్న అజిత్ పవార్ మరణం తీవ్ర బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మరోవైపు మంత్రి సీతక్క సైతం అజిత్ పవార్ మరణం పట్ల తన సానుభూతిని తెలియజేశారు.
Also Read: Telangana BJP: ఉత్తర తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు

