Gadwal Politics: అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థుల బీఫామ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పటికే పంచాయతీలలో మెజార్టీ స్థానాలు గెలుచుకోగా మున్సిపాలిటీ ఎన్నికలపై నాయకుల దృష్టి పడింది.తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కాంగ్రెస్ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వర్గానికి గద్వాల ఇన్చార్జ్ సరిత వర్గానికి మధ్య బీఫాంల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫాంలు దక్కించుకునేందుకు ఆశావాహులు ఇరువురి నేతలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. తమకు టికెట్టు దక్కకపోతే ప్రత్యామ్నాయంగా మరో పార్టీ నుంచి బీఫామ్ దక్కించుకునేందుకు సైతం సిద్ధమవుతున్నారు. కొందరు సిట్టింగ్ కౌన్సిలర్లకు మరోసారి బీఫామ్ దక్కనుందనే ప్రచారం నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో ఉంటూనే పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అభ్యర్థి వెంట ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి గెలుపు కష్టమనే ధోరణిని అభ్యర్థుల వెంట తిరిగే నాయకులు తమ సన్నితులతో వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ టికెట్ కోసం తీవ్ర పోటీ
అధిక వార్డుల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంది. సిట్టింగ్ కౌన్సిలర్లు ఉన్నచోట కొత్త వారు చాలా మంది ఆశావాహులు టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీ జెండా మోస్తున్న తమకు ఈసారైనా అవకాశం ఇవ్వరా అంటూ కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వని పక్షంలో ఏం చేయాలన్న దానిపై పలువురు స్పష్టతతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చివరి నిమిషం దాక ప్రయత్నించి దక్కని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి కూడా కొందరు రెడీ అవుతున్నారు. ఎన్నికలలో తప్పక పోటీ చేస్తామని,పార్టీ టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా బరిలో నిలుస్తామని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వార్డులలో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పక పోవచ్చని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Alson Read: CP Sajjanar: శాంతిభద్రతల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం.. ఖాకీల ఆరోగ్యంపై సీపీ సజ్జనార్ ప్రత్యేక ఫోకస్!
వార్డుల్లో ఎన్నికల వాతావరణం
జిల్లాలోని గద్వాల,ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీ వార్డులలో ఎన్నికల వాతావరణం నెలకొంది.ఒక వైపు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఆశావాహులు టికెట్ ఆశిస్తున్న వారు తమకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్తుందంటూ అభ్యర్థులు చెప్పుకునే ఓటు అభ్యర్థిస్తున్నారు. కొందరైతే తమకు మద్దతు ఇస్తే కాలనీలో చేసే అభివృద్ధి పై మాట ఇస్తున్నారు. కొందరు వీధి దీపాలు పెట్టిస్తుంటే మరికొందరు రోడ్ల మరమ్మత్తులు చేపడుతూ కమ్యూనిటీలవారీగా కుల సంఘాలు, యువజన సంఘాలతో భేటీ అవుతూ ఓటర్లను ప్రభావితం చేసే వారితో మమేకమవుతూ మంతనాలు చేస్తూ తమకు ఈసారి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
తెగని బీఫాంల పంచాయతీ
గద్వాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత అనుచరులకు బీఫాముల పంపిణీ విషయంలో ఇరువురు నేతల మధ్య పోటీ నెలకొంది. 37 వార్డులకు గాను తమ వారికే ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబడుతుండగా, ఇప్పటికే సరిత జిల్లా ఇన్చార్జ్ దామోదర రాజనర్సింహ తో పాటు పలువురు పార్టీ పెద్దలను కలిసి చర్చించారు. ఇరువురికి సమానంగా సీట్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యేకు పెద్దలు సూచించినట్లు ప్రచారం నడుస్తోంది. అన్ని వార్డులకు తన అనుచరులకే బి ఫామ్ లు ఇవ్వాలని అలా ఇవ్వలేని పక్షంలో తన పానల్ రెబల్‌గా పోటీ చేసి గెలిపించుకుంటానని ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో బీఫాముల సమస్య త్వరలోనే తీరనుంది. మరోవైపు జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి తన ద్వారానే బి ఫాంలు జారీ చేయబడతాయని ఆశావాహులు ఎన్నికలలో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు.
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా.. రసవత్తరంగా మున్సిపల్ పోరు..!

