Illegal Construction: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కేవలం నోటీసులకే పరిమితమవుతున్నారా? చట్టప్రకారం చర్యలు తీసుకోరా? అనే ప్రశ్నలు స్థానికుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఎల్లంపేటలో సర్వే నెంబర్లు 70, 71లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన గోదాం నిర్మాణంపై కథనం వెలుగులోకి రావడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఉన్న కమిషనర్ కూడా ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది జూలై 3న ఒకసారి, అదే నెల 10న మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
అధికారుల తీరుపై విమర్శలు
వారం రోజుల్లో అవసరమైన అనుమతి పత్రాలను సమర్పించి వివరణ ఇవ్వాలని, లేదంటే అక్రమ నిర్మాణంగా పరిగణించి మున్సిపాలిటీ చట్టం–2013 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. అయితే యజమానుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కొద్ది రోజుల పాటు నిర్మాణాన్ని నిలిపివేసి, తిరిగి పనులు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు ఇవ్వడమే తప్ప, చట్టప్రకారం చర్యలు తీసుకోకపోవడంతో యజమానులు నిర్మాణాన్ని నిర్భయంగా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 23న ప్రస్తుత కమిషనర్ నోటీసులు ఇచ్చినప్పటికీ గోదాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇచ్చినట్లే వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఈసారి అయినా మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడకుండా అనుమతి లేని నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్న ప్రజల్లో నెలకొంది.
Also Read: OnePlus Nord 6: వన్ ప్లస్ నుంచి మరో క్రేజీ ఫోన్.. నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు భయ్యా.. అస్సలు వదలద్దు!
అధికారుల వివరణ
ఎల్లంపేటలో సర్వే నెంబర్లు 70, 71లో జరుగుతున్న నిర్మాణానికి సంబంధించి నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ స్వామి తెలిపారు. “తాను బాధ్యతలు చేపట్టకముందే నిర్మాణం ప్రారంభమైంది. ఈ నెల 23న నోటీసులు జారీ చేశాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం,” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Dog Guards Dead Body: మంచులో చనిపోయిన యజమాని.. డెడ్‌బాడీకి 4 రోజులు కాపలా కాసిన పెంపుడు శునకం

