Municipal Elections 2026: తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ (Municipal Elections 2026 Schedule) మంగళవారం విడులదైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుందని, ఒక్క రోజు గ్యాప్‌లో అంటే, ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ బుధవారం (జనవరి 28) నుంచి మొదలవుతుందని తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో నేటి (మంగళవారం) నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తెలిపింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.
పూర్తి వివరాలు ఇవిగో
నామినేషన్లు బుధవారం నుంచి ప్రారంభమవనుండగా, ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిటర్నింగ్ ఆఫీసర్ స్వీకరిస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల ఫైలింగ్‌కు చివరి తేదీ జనవరి 30 (శుక్రవారం) వరకు ఉంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు నామిషన్ల దాఖలకు ముగింపు పడుతుంది. ఇక, జనవరి 31న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి పరిశీలన చేస్తారు. ఇక, పరిశీలన పూర్తయిన తర్వాత, అదే రోజున బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఫిబ్రవరి 1 తేదీన సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం వివరించింది.
కాగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 3 , సాయత్రం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఒకవేళ రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏమైనా ఏర్పడితే, ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఇక, 13వ తేదీని ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని వివరించారు.
Read Also- OnePlus Nord 6: వన్ ప్లస్ నుంచి మరో క్రేజీ ఫోన్.. నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు భయ్యా.. అస్సలు వదలద్దు!

