H-City Project: నగరంలో హెచ్ సిటీ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వచ్చే నెల 10వ తేదీ నాటికి జీహెచ్ఎంసీ (GHMC) ప్రస్తుత పాలక మండలి అధికార గడువు ముగియనున్నది. ఈ పాలక మండలి హయాంలోనే పనులు ప్రారంభించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే భూసార పరీక్షలు, సర్వే స్థాయిలో ఉన్న హెచ్ సిటీ పనులను క్షేత్ర స్థాయిలో విజిబిలిటీగా కనిపించేలా పనులు ప్రారంభించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రూ.7,038 కోట్లతో ఐదు ప్యాకేజీలుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫై ఓవర్ బ్రిడ్జిలు, గ్రేడ్ సెపరేటర్లతో పాటు అండర్ పాస్‌లు వంటివి మొత్తం 23 ప్రాజెక్టులను నిర్మించేందుకు 2023 డిసెంబర్ మాసంలోనే సర్కార్ పరిపాలన పరమైన మంజూరీనిచ్చింది. కేబీఆర్ పార్కు వద్ద రూ.1,090 కోట్లతో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్‌లతో పాటు కూకట్‌పల్లి వై జంక్షన్‌లో అటు మియాపూర్ వరకు, ఇటు అమీర్‌పేట వరకు నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్లను ఖరారు చేసినా, క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టకపోవటంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ ప్రతి మంగళవారం ప్రాజెక్టులపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: H-City Project: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.5942 కోట్లతో కొత్త రోడ్ ప్రాజెక్టులు ప్రారంభం
ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులపై దృష్టి
కేబీఆర్ పార్కు వద్ద పనులకు ఇప్పటికే మంజూరైన రూ.1,090 కోట్లలో కేవలం రూ.110 కోట్లను కేవలం యుటిలిటీ బదలాయింపు పనులకు వెచ్చించనున్నట్లు తెలిసింది. హెచ్ సిటీ పనుల్లో భాగంగా కేబీఆర్ పార్కు వద్ద పనులకు సంబంధించిన సగం ఆస్తుల నుంచి స్థల సేకరణ కూడా పూర్తి అయినప్పటికీ, ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. అయినా, కోర్టులో కేసులు లేని ప్రాంతాల్లో పనులను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10 తేదీలోపు కేబీఆర్ పార్కు వద్ద ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తొలుత కేబీఆర్ పార్కు సమీపంలో ఉన్న అగ్రసేన్ మహారాజ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయనున్న అండర్ పాస్, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు నిర్మించనున్న స్టీల్ ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులపై దృష్టి సారించినట్లు సమాచారం.
ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించాలి
అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ పనులు ప్రారంభించి, వీలైనంత త్వరగా అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేలోపే పనులను కొలిక్కి తీసుకురానున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి మియాపూర్ వైపు నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత నిత్యం రద్దీగా ఉండే నానల్‌నగర్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించాలని భావిస్తున్నందున ఇక్కడ చేయాల్సిన స్థల సేకరణపై కమిషనర్ కర్ణన్ ఇటీవలే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మొత్తానికి జీహెచ్ఎంసీలో ఇంకా కేవలం పక్షం రోజులు మాత్రమే పాలక మండలి పవర్‌లో ఉండనున్నందున అంతలోపు హెచ్ సిటీ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
Also Read: H-City Projects: హెచ్ సిటీ పనుల్లో కదలిక.. ఈ నెల 7 వరకు అన్ని ప్రాజెక్టుల టెండర్లు పూర్తికి ప్లాన్!

