Dad Kills Daughter: విద్య విషయంలో తమ పిల్లలు ప్రతిభావంతులు కావాలని తల్లిదండ్రులు అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అర్థపర్థం లేకుండా చిన్నవయసు నుంచే చదువు విషయంలో బాలల్ని రాచిరంపాన పెడుతున్న పేరెంట్స్ ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ, హర్యానాలో ఓ కర్కశ తండ్రి మాత్రం ఊహకందని ఘోరానికి పాల్పడ్డాడు. కేవలం నాలుగేళ్ల వయసున్న తన బిడ్డ 50 వరకు అంకెలు చెప్పలేదని ప్రాణాలు (Dad Kills Daughter) హరించేశాడు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది.
Read Also- T Hub – CM Revanth: టీ-హబ్‌ను స్టార్టప్ కంపెనీలకే వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనవరి 21న ఈ దారుణ ఘటన జరిగింది. క్రిష్ణ జైస్వాల్ అనే వ్యక్తి ఆవేశంలో కన్నకూతుర్ని చేతులారా చంపేసుకున్నాడు. ఇంటి వద్ద కూతురికి చదువు చెబుతున్న సమయంలో 50 వరకు అంకెలు చెప్పాలని అడిగాడు. కానీ, ఆ చిన్నారి చెప్పలేకపోయింది. దీంతో, తీవ్ర ఆవేశానికి లోనైన క్రిష్ణ జైస్వాల్ చిన్నారిని పశువుని కొట్టినట్టు కొట్టాడు. ఎంతలా అంటే, చావబాదడంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఎంతలేపినా చిన్నారి లేవకపోవడంతో హుటాహుటిని ఆమెను సమీపంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అయితే, పరిశీలించిన వైద్యులు.. చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు. నిందితుడు క్రిష్ణ జైస్వాల్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. అయితే, కొంతకాలంక్రితం ఉపాధి కోసం హర్యానాలోని ఫరీదాబాద్ వలస వెళ్లాడు.
Read Also- RS Praveen Kumar: సజ్జనార్‌కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్.. సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్టు
నిందితుడు జైస్వాల్ పగటి పూట ఇంటి వద్దే ఉండి కూతుర్ని చూసుకునేవాడు. ఘటన జరిగిన రోజు చిన్నారిని కొట్టిన తర్వాత ఫోన్ చేసి తన భార్యకు సమాచారం ఇచ్చాడు. కానీ, నిజాన్ని దాచిపెట్టి నాటకం ఆడాడు. ఆడుకుంటూ మెట్ల మీద నుంచి కిందపడిందని కట్టుకథ అల్లి చెప్పాడు. దెబ్బలు బాగా తగలడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లానంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, చిన్నారి మృతదేహంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో గమనించిన తల్లి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి జైస్వాల్‌ను ప్రశ్నించారు. విచారణలో అతడు నిజం ఒప్పుకున్నాడు. కూతురు స్కూల్‌కి వెళ్లలేదని, అందుకే తాను ఇంటి దగ్గర చదువు చెప్పానని వివరించాడు. 50 వరకు అంకెలు చెప్పలేకపోవడంతో తనకు ఆవేశం వచ్చి కొట్టానని పోలీసుల ముందు నిజాలు వెల్లడించాడు. ఈ ఘటనలో నిందితుడు జైస్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతులు ఇద్దరూ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. ఫరీదాబాద్‌లోని ఝర్సెంతాలి అనే ప్రాంతంలో ఒక అద్దె నివాసం ఉంటున్నారని, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కొడుకు వయసు ఏడేళ్లు, రెండేళ్ల వయసున్న మరో కూతురు కూడా ఉందని వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని అధికారులు చెప్పారు.

