RS Praveen Kumar: తనపై ఏడు కేసులున్నాయంటూ బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) చేసిన ఆరోపణలపై ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేపడుతున్న సిట్ చీఫ్, హైదరాబాద్ సిటీ కమిషనర్ సీపీ సజ్జనార్ (VC Sajjanar) స్పందించిన విషయం తెలిసిందే. తనపై ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ మేరకు సిట్ అధికారులు ప్రవీణ్ నివాసానికి వెళ్లి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం (January 24) స్పందించారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని, చిల్లర భాషను వాడనని, వాస్తవాలు దాచనని అన్నారు. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపనని చెప్పారు. ‘‘ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చిన సజ్జనార్ ఏర్పాటైన రెండవ సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని తెలంగాణ భవన్‌లో పత్రికా సమావేశంలో ఖండించాను. ప్రెస్‌మీట్ జరిగిన 12 గంటల లోపే రాత్రి 12 గంటలకు మా ఇంటికి వచ్చి సిట్ పోలీసులు నాకు నోటీసు ఇచ్చారు. రెండు రోజుల్లో ఆధారాలతో సహా రిప్లై ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్దం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారు!!’’ అని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
నేను భయపడను
‘‘ప్రజా సమస్యలపై, దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు. నేను వార్నింగ్‌లకు భయపడను. నా దగ్గర ఉన్న సమాచారంతో జవాబు ఇస్తాను. తరువాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను నిన్న మీడియా సమావేశంలో చెప్పిన కీలకమైన విషయాలు స్పష్టత కోసం కింద మళ్లీ ఇస్తున్నా’’ అని అన్నారు. దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, వ్వవస్థీకృత నేరాల నివారణ కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని చట్టమే చెప్పిందని, దీనికి అనేక మార్గదర్శకాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అనేక మంది అధికారులు రకరకాల స్థాయిల్లో దీన్ని పర్యవేక్షిస్తారని, ఇది ఒక్క ఆఫీసర్ వల్ల అయ్యే పని కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్నే దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారంటూ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ జరగడం మామూలే అని ఢిల్లీలో చెప్పినట్లుగా కూడా వార్తలున్నాయని, అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.
Read Also- Honor Robot Phone: ప్రపంచంలోనే తొలి రోబోటిక్ మెుబైల్.. లాంచ్ డేట్ షురూ.. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఇవే!
ఇది వాస్తవ విరుద్ధం
‘‘నేను సిట్ ఛీఫ్ సజ్జనార్ మీద ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలి అని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉంది. ఇది వాస్తవ విరుద్ధం’’ అని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘‘నేను చెప్పింది.. గతంలో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (నేటి తెలంగాణ సీఎం!) అడ్డంగా దొరికిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం, ఇంటలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని 2015 జూన్ నెలలో ఆంధ్రలో చాలా పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయి. ఆ సమయంలో ఆంధ్రలో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యింది. ఆ కాలంలో నేటి సీపీ సజ్జనార్ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిగా పనిచేశారన్న అవగాహన నాకుంది. అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో తెలంగాణ సిట్‌కు చీఫ్‌గా ఉండడం నైతికంగా కరక్టు కాదు అని నా అభిప్రాయం చెప్పాను. ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల ముందుకు ఈ మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకరావాల్సిన కనీస బాధ్యత నాపై ఉంది. మీకు ఇది నచ్చకపోతే వివరణ ఇవ్వండి’’ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
తాను సజ్జనార్‌తో సహా ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదని, పాల్పడను, తనకు ఆ సంస్కృతి లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిజానికి కేటీఆర్, హరీష్ రావు, మరెందరో బీఆరెస్ నాయకులు గత రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి గురయ్యారని అన్నారు. ఆ విషయంలో నిందితులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, ఎందుకని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ట్యాపింగ్‌పై తాను చేసిన ఫిర్యాదుపై ఆయనకు పోలీసులు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదని, తనకు కనీసం అక్నాలెడ్జ్మెంటు కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.
Read Also- KGBV Bunker Beds: బంకర్ బెడ్స్ టెండర్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ..!

