KTR – Janasena Party: సిరిసిల్ల జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ సినీ నటుడు ఆర్కే సాగర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమంలో ఆర్కే సాగర్ పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని నేతన్న విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం శివనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రాంత భేదాలు లేవని జనసేన పార్టీ తెలంగాణ గడ్డమీద పుట్టిన పార్టీ అని అన్నారు.
సిరిసిల్లకు పవన్ కళ్యాణ్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో ఆ తర్వాత కూడా చేనేతలకు అండగా ఉండాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతి సోమవారం చేనేత దుస్తులను ధరించారని అన్నారు. రానున్న రోజుల్లో చేనేతలకు అండగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ సిరిసిల్లకు వస్తారని ఈ సందర్భంగా ఆర్కే సాగర్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
కేటీఆర్కు కంచుకోట
ఇదిలా ఉంటే సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కంచుకోట లాంటింది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు బీఆర్ఎస్ పానలో సిరిసిల్ల మున్సిపాలిటీపై కూడా కేటీఆర్ పూర్తి ఆదిపత్యం సాధించారు. 2023 ఓటమి తర్వాత కూడా సిరిసిల్లలో బీఆర్ఎస్ (BRS) చాలా బలంగానే ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సిరిసిల్ల జిల్లాలో మెజారిటీ సంఖ్యలో ఎన్నికయ్యారు.
Also Read: ChatGPT Saves Dog: చాట్ జీపీటీ సాయంతో.. కుక్కను కాపాడిన యజమాని.. ఏఐ వాడకం మామూల్గా లేదుగా!
జనసేన ప్రభావమెంత?
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా నుంచి జనసేన సత్తా చాటడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో జనసేన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్క సీటులోనూ డిపాజిట్ రాలేదు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం భారీగా ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ కు కంచుకోట కావడంతో పాటు.. అటు అధికార పార్టీ కాంగ్రెస్ సైతం సిరిసిల్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టనుండటంతో జనసేనకు మరింత కష్టంగా మున్నిపల్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ స్వయంగా వచ్చి సిరిసిల్లలో ప్రచారం చేస్తే కాస్త ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. మెుత్తం మీద సిరిసిల్ల జిల్లా నుంచి జనసేన బరిలోకి దిగడం రాష్ట్రంలో ఒక ఆసక్తికర చర్చకు దారి తీసింది.

