Harish Rao: సింగరేణిలో బొగ్గు స్కాం మాత్రమే కాదు, సోలార్ స్కాం కూడా జరిగిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మరో లేఖ రాశారు. సీబీఐతో సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. 127 మెగా వాట్ల సోలార్ స్కాం జరిగిందని, మూడు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్స్ పెట్టాలని, ఎంఎస్ఎంఈలను పాల్గొనకుండా మూడింటికీ కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారన్నారు. టెండర్ అనుమతులు కఠినం చేశారని, సోలార్ ప్లాంట్స్‌కు కూడా సైట్ విజిట్ నిబంధన పెట్టారన్నారు. ప్రభుత్వం అనుకున్న వారికి టెండర్లు దక్కేలా చూశారు, రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వచ్చేలా టెండర్లు కట్టబెట్టారన్నారు. సోలార్ పవర్ మెగావాట్ దేశమంతా రూ.3 కోట్ల రూపాయలు అని, కానీ, మన దగ్గర రూ.5 కోట్ల 4 లక్షలకు టెండర్ ఇచ్చారని, అదనంగా సింగరేణి భూములు కూడా ఇచ్చారని ఆరోపించారు.
67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్
దాదాపు రూ.7 కోట్లకు ఒక మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్‌ను కట్టబెట్టారని, నేషనల్ యావరేజ్ కంటే ఇది డబుల్ కాస్ట్ అన్నారు. 480 కోట్లకు వారికి కావలసిన కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు మార్చడం అనుయాయులకు కట్టబెట్టారని, రూ.250 కోట్ల దాకా నేరుగా చేతులు మారాయని ఆరోపించారు. రూ.500 కోట్లు అదనంగా చెల్లింపులు జరిగాయన్నారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో ఎక్స్‌ప్లోజింగ్ స్కాం
సింగరేణిలో ఎక్స్‌ప్లోజింగ్ కోసం జిలెటిన్ స్టిక్స్ వాడతారని, వాటి కొనుగోలులో 30% రేటు అదనంగా పెట్టి కొనాలని ఒత్తిడి తెచ్చారని హరీశ్ రావు అన్నారు. ఒక డైరెక్టర్ 30% ఎక్కువ రేటుకు కొనడానికి నిరాకరిస్తే ఒత్తిడి చేస్తే చివరకు రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తర్వాత ఇంకో డైరెక్టర్ కూడా సంతకం పెట్టను అని నిరాకరిస్తే ఆయనను డైరెక్టర్ నుంచి జీఎం పదవికి రివర్స్ చేశారని, ఇలా బెదిరించి భయపెట్టి నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కాంకు తెరతీస్తున్నారని ఆరోపించారు.
ప్రకాశం గని స్కాం
దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ అనేది పెట్టడం వల్లనే ఈ స్కాం బయట పడిందని హరీశ్ అన్నారు. ఇక్కడ కూడా సైట్ విసిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్‌ను పిలిచారని, ఫిబ్రవరి 2వ తేదీ లాస్ట్ డేట్ ఉన్నదన్నారు. ఇక్కడ కూడా రింగు చేస్తున్నారు, మరి సైట్ విజిట్ విధానం తప్పయితే ప్రకాశం గని టెండర్‌ను కూడా రద్దు చేయాలన్నారు. రూ.1,044 కోట్లతో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి ఈ టెండర్‌ను కూడా పిలిచారు కాబట్టి ప్రకాశం గని కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీరాంపూర్ ఓబీ.. మరో స్కామ్
శ్రీరాంపూర్‌లో ఓబీ రూ.600 కోట్ల వర్క్ టెండర్ పిలిచారని, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్డు కోసం ఏడుసార్లు డేట్ ఇచ్చి వాయిదా వేశారన్నారు. హైదరాబాద్ హోటల్‌లో సృజన రెడ్డి సెటిల్‌మెంట్లు కుదరకపోవడం వల్ల ఏడుసార్లు వాయిదా వేశారన్నారు. ఎందుకు శ్రీరాంపూర్ ఓబీ టెండర్ ఏడుసార్లు వాయిదా పడ్డదో విచారణ చేపట్టాలని కిషన్ రెడ్డిని హరీశ్ రావు కోరారు. ఇది కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ తోనే టెండర్లను ఖరారు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వచ్చినంక మొత్తం సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో 6 ఓబీ కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారని, ఈ ఆరు ఓబీ కాంట్రాక్టర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో పిలిచిన ప్రతీ టెండర్‌ను రద్దు చేయాలని కోరారు. జైపూర్‌లో సింగరేణి కడుతున్న థర్మల్ పవర్ ప్లాంట్‌లో కూడా అవకతవకలు జరిగాయని అన్నారు. వాటి మీద కూడా త్వరలో సమాచారం బయట పెడతామని, వాటి మీద కూడా విచారణ జరిపించాలన్నారు. నిజాయితీ ఉంటే సృజన్ రెడ్డిపై సిట్ వేయాలని, సింగరేణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటివరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, పూర్తి విచారణ జరపాలని కిషన్ రెడ్డిని హరీశ్ రావు కోరారు.
Also Read: Liquor Business War: మునుగోడు సెగ్మెంట్ లో రచ్చకెక్కిన లిక్కర్ బిజినెస్ వార్

