Google Pixel Bug: ప్రపంచంలోని టాప్ బ్రాండ్ మెుబైల్ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ (Google Pixel phone) ఒకటి. ఐఫోన్ (iPhone) తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న మెుబైల్ గా దీనిని యూజర్లు చెబుతుంటారు. అలాంటి గూగుల్ పిక్సెల్ ఫోన్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. యూజర్లు తమకు వచ్చిన ఫోన్లను లిఫ్ట్ చేయనప్పటికీ.. అవతలి వ్యక్తులకు వారి వాయిస్, బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు వినిపిస్తున్నట్లు తాజా నివేదిక ఒకటి పేర్కొంది.
వ్యక్తిగత గోప్యతకు భంగం
ప్రముఖ టెక్ వెబ్ సైట్ ‘9To5Google’ రాసిన కథనం ప్రకారం.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో ఉన్న ‘టేక్ ఎ మెసేజ్’ (Take a Message) అనే ఫీచర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీని కారణంగా కాల్ సమయంలో యూజర్ వైపు ఉన్న ఆడియో (వాయిస్ లేదా బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు) వారి ప్రమేయం లేకుండా అవతలి వ్యక్తులకు వినిపిస్తోంది. ‘ఫోన్ బై గూగుల్ యాప్’ (Phone by Google App)లోని స్మార్ట్ కాలింగ్ ఫీచర్లు వాడే పిక్సెల్ యూజర్లకు ప్రధానంగా ఈ సమస్య ఎదురవుతున్నట్లు ‘9To5Google’ కథనం పేర్కొంది. దీని వల్ల పిక్సెల్ యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతున్నట్లు అభిప్రాయపడింది.
‘టేక్ ఎ మెసేజ్’ ఫీచర్ ఏంటీ?
పిక్సెల్ యూజర్లకు ఆధునాతన కాలింగ్ సౌకర్యం అందించడంలో భాగంగా.. ఫోన్ బై గూగుల్ యాప్ లో ‘టేక్ ఎ మెసేజ్’ అనే ఏఐ ఆధారిత ఫీచర్ ను తీసుకొచ్చారు. ఇది మిస్డ్ కాల్ లేదా తిరస్కరించిన కాల్స్ (బిజీగా ఉన్న సమయంలో)కు దానంతట అదే సమాధానం ఇవ్వగలదు. అదే సమయంలో వాయిస్ మెయిల్ తరహాలో కాలర్ నుంచి సందేశాన్ని స్వీకరించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతోంది.
అసలు ఆ బగ్ ఏంటీ?
9To5Google కథనం ప్రకారం.. ఈ ఫీచర్ కొన్ని ఫోన్లలో అసాధారణంగా ప్రవర్తిస్తోంది. కొందరు వినియోగదారులు కాల్స్ తిరస్కరించిన తర్వాత కూడా మెుబైల్ స్క్రీన్ పై మైక్ ఆన్ అయినట్లు చూపిస్తోందని సదరు కథనం పేర్కొంది. అయితే ఈ సమస్య అతికొద్ది మంది పిక్సెల్ యూజర్లకు మాత్రమే ఎదురవుతున్నట్లు తెలిపింది. ఈ సమస్య ఇప్పటికే గూగుల్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై గూగుల్ పిక్సెల్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Realme Neo 8 Mobile: రియల్‌మీ నుంచి పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవడం పక్కా!
ఎలా బయటపడాలి?
అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ లీకయ్యే సమస్యకు ఒక చిన్న ట్రిక్ ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా పిక్సెల్ యూజర్లు ఫోన్ బై గూగుల్ యాప్ ను ఓపెన్ చేయాలి. అనంతరం కుడివైపు టాప్ లో కనిపించే మూడు చుక్కల ఐకాన్ వద్ద క్లిక్ చేయాలి. అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘కాల్ అసిస్ట్’ ఆప్షన్ ను సెలక్ట్ చేయాలి. అనంతరం మీకు కనిపించే టేక్ ఎ మెసేజ్ ఆప్షన్ ఎనేబుల్ ఉంటే దానిని వెంటనే డిసేబుల్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ ఫీచర్ ఆటోమేటిక్ గా డీయాక్టివేట్ అయిపోతుంది. బగ్ సమస్య పరిష్కారం అయ్యే వరకూ గూగుల్ పిక్సెల్ యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

