BJP Telangana: త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP Telangana) తన ప్రచార వ్యూహాన్ని ముమ్మరం చేసింది. రాష్ట్ర నాయకత్వం మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభల ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి దిగ్గజాలను రంగంలోకి దించుతున్నది. అగ్ర నేతల రాకతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కనున్నది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయ పార్టీ ముందుకెళ్తున్నది. ఈ సభల ప్రతిపాదనలను ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సైతం రాష్ట్ర నాయకత్వం పంపినట్లు సమాచారం.
ఉత్తర తెలంగాణపై ఫుల్ ఫోకస్
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఊపు తెచ్చేందుకు తెలంగాణకు జాతీయ నేతలను తీసుకు రానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, ఇతరులను తీసుకొచ్చి భారీ సభల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కమలం పార్టీ అగ్ర నేతలు తెలంగాణకు రానుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరిగింది. తెలంగాణలో ఉత్తర తెలంగాణలో కమలం హవా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే ఎన్నికలతో మొదలైన ఈ పరంపర ఎంపీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ కొనసాగింది. అందుకే రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం సైతం ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సభలు సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు యాక్టివ్ మోడ్‌లో పని చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆఫీస్ బేరర్ల మీటింగులో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
త్వరలోనే తేదీలపై క్లారిటీ
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరుకానున్నట్లు సమాచారం. అలాగే, సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ గడ్డపై సత్తా చాటేందుకు కేంద్రమంత్రి జేపీ నడ్డాను తీసుకు వస్తున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో నిర్వహించే సభలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరై శ్రేణుల్లో ఉత్సాహం నింపే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ సభలకు సంబంధించిన తేదీలపై క్లారిటీ రావాల్సి ఉన్నది. అతి తర్వలోనే రాష్ట్ర నాయకత్వం తేదీలను ఫిక్స్ చేసే అవకాశమున్నది.
అత్యవసరంగా ఆఫీస్ బేరర్ల మీటింగ్
నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు భేటీ అయ్యారు. హస్తిన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన అత్యవసరంగా ఆఫీస్ బేరర్ల మీటింగ్ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు గాను జాతీయ నాయకత్వం ముగ్గురిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్, కో ఇన్‌ఛార్జులుగా రేఖా శర్మ, అశోక్‌ను నియమించారు. ఇప్పటికే జిల్లా, మున్సిపాలిటీల వారీగా రాష్ట్ర నేతలను ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఇదే క్రమంలో రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. జన సమీకరణపై దృష్టి సారించాలని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అగ్ర నేతల పర్యటనల ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. మరి కమలం పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకుంటుందా లేదా అనేది చూద్దాం.
Also Read: BJP Telangana: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ హైకోర్టులో పిటిషన్..!

