Arrive Alive Program: గ్రామస్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణలో సర్పంచుల పాత్ర కీలకం
మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ సూచన
రోడ్డు భద్రత నియమాలపై సర్పంచులతో ప్రతిజ్ఞ
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: మెదక్, హవేలిఘనపూర్, నార్సింగి మండలాలకు చెందిన 100 మంది నూతన సర్పంచులకు రోడ్డు భద్రతపై అవగాహన కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
Read Also- Belt Shops Controversy: బెల్టుషాపును అడ్డుకుంటే ఊరుకోం.. మహిళలపై మందుబాబుల గుర్రు!
హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగంతో పాటు మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయరాదని, వేగ నియంత్రణ పాటించాలని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరంతో పాటు పలు అంశాలపై సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో విద్యార్థులు, యువత, వాహనదారులలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నూతన సర్పంచ్‌లకు సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం లక్ష్యం ఒక్క ప్రాణం కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోకుండా చూడటమేనని ఆయన తెలిపారు. చివరగా సర్పంచులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, డీపీవో యాదయ్య, డీఎల్‌పీవో ఎల్లయ్య, మెదక్ టౌన్ సీఐ మహేష్, 100 మంది నూతన సర్పంచులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also- Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీలో బిగ్ బజ్!.. హీరో ఎవరంటే?

