Nalgonda News: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ షిఫ్టింగ్ పై సబ్ రిజిస్ట్రేషన్, ఎన్ ఎస్పీ శాఖల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారం కోసం సామరస్యంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఇరుశాఖల అధికారులు గొడవలు పెట్టుకునే పరిస్థితికి దారి తీయటం ఇప్పుడు నల్గొండ(Nalgonda) జిల్లా మిర్యాలగూడ(Miryalaguda)లో చర్చగా మారింది. ఇరు శాఖలు ప్రజల కోసమే కార్యనిర్వహణ చేయాల్సి ఉండగా శాఖల ఆధిపత్య పోరుకు సబ్ రిజిస్ట్రేషన్ షిఫ్టింగ్ వ్యవహారం పరాకాష్టగా మారింది.
నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని అద్దె బిల్డింగ్ లో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పర్యవేక్షణలో మిర్యాలగూడ ఎన్ ఎస్పీ ఏ టైపు క్వార్టర్స్ లోకి షిఫ్ట్ చేశారు. పాత ఆఫీస్ నుంచి ఎన్ ఎస్పీ క్వార్టర్స్ లోకి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించిన దస్త్రాలతో పాటు ఇతర అవసరమైన పరికరాలను షిఫ్ట్ చేశారు. కాగా తమ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎన్ఎస్పీ క్వార్టర్ ను సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు కేటాయించిన తీరుపై బుధవారం షిఫ్ట్ చేసిన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట ఇరిగేషన్ అధికారులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఎన్ ఎస్పీ అతిథి గృహం వద్ద ఇరిగేషన్ ఎస్ ఈ తో కలిసి మాట్లాడారు. తమ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల అనంతరమే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును షిఫ్ట్ చేయాల్సి ఉండగా అలాంటి నిబంధనలు పాటించకుండా హడావిడిగా మార్చారని లోకల్ ఇరిగేషన్ అధికారులు ఆరోపించారు. ఇదే విషయమై సబ్ రిజిస్టర్ బలరామ్ మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకే షిఫ్ట్ చేసినట్లు చెప్పారు.
Also Read: Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో పలువురిపై కేసు..
ముదురుతున్న వివాదం
తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం ప్రభుత్వ బిల్డింగులు ప్రైవేట్ బిల్డింగుల్లో నడుస్తున్నాయని గుర్తించింది. ప్రైవేట్ భవనాల్లో నడిచే ప్రభుత్వ సంస్థలను నిర్వహణకు అవసరమైన స్థలం కలిగిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాల్లోకి మార్చాలని గత ఏడాది డిసెంబర్లో ప్రకటించింది. ఆయా శాఖలకు సంబంధించిన ఖాళీగా ఉన్న గదులు, స్థలం ఏరియా, ఇతర అంశాలను పరిశీలించి జనవరి 31 వరకు ప్రైవేట్ బిల్డింగ్ నుంచి ప్రభుత్వ భవనాల్లోకి షిఫ్ట్ చేసేందుకు డెడ్ లైన్ విధించింది. అయితే ఇలా ఉండగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 32 శాఖలకు సంబంధించిన కార్యాలయాలను ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని అదేశాలు ఇచ్చారు.
తీవ్రమైన అభ్యంతరాలు
ఇదంతా ఓ భాగం అయితే మిర్యాలగూడ(Miryalaguda)లోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఎన్ ఎస్పీ క్వార్టర్స్ లోకి మార్చడంపై ఇరిగేషన్ అధికారులు నిరసన వ్యక్తం చేయడం, సబ్ రిజిస్టర్ పై గొడవకు దిగటం చర్చనీ యాంశంగా మారుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఆఫీస్‌ల నిర్వహణకు చెల్లించే అద్దెల భారం తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి అమలు చేసేందుకు డెడ్ లైన్ విధించినప్పటికీ ఇరిగేషన్ అధికారులు నల్ల బ్యాడ్జీలను ధరించి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసన చేయడం ఈ వివాదం ఎటు దారి తీస్తుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అద్దెల భారం తగ్గించుకునే విషయంలో ప్రభుత్వ కార్యాలయాలను షిఫ్టింగ్ చేసే విషయంపై ప్రకటన చేసే ముందు శాఖల మధ్య ఉన్నటువంటి పాలనాపరమైన ఇబ్బందులను గుర్తించి ఉత్తర్వులు జారీ చేయలేదా లేక మరోటి తెలియదు కానీ ప్రధానంగా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ షిఫ్టింగ్ అంశం సస్పెన్స్ గా మారింది. ఇరిగేషన్ అధికారుల నిరసనకు తలొగ్గి సబ్ రిజిస్ట్రేషన్ కు కేటాయించిన క్వార్టర్‌ను రద్దు పరుస్తారా లేక కొనసాగిస్తారా అనే విషయం మిస్టరీగా మారింది.
Also Read: Singareni: సింగరేణి టెండర్లతో అసలు లబ్ధి పొందింది ఎవరు?.. దాచి పెట్టినా దాగని వాస్తవాలు ఏంటి..?

