Revenge Politics: గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ అధికారులను అడ్డుపెట్టుకొని విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైసీపీ అధినేత జగన్ (YS Jagan)తో పాటు ఆ పార్టీ నేతలు గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఖాకీలు.. టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే కోవలోకి తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కూడా వచ్చి చేరింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టి.. ఫోన్ ట్యాపింగ్ వంటి వివాదస్పద కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రిటైర్ అయినా వదలరట..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు (Harish Rao) సిట్ (SIT) విచారణకు హాజరైన నేపథ్యంలో తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆడుతున్న రాజకీయ క్రీడల్లో అధికారులు బలి కావొద్దని హెచ్చరించారు. రేపు అధికారంలోకి వచ్చేది తామేనని ఈ విషయాన్ని సిట్ అధికారులు, పోలీసులు మర్చిపోవద్దని పరోక్షంగా సూచించారు. తమ ప్రభుత్వం వచ్చాక రిటైర్ అయిన అధికారులను సైతం వదిలిపెట్టబోమని బహిరంగంగా బెదిరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే తెలంగాణలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి.
జగన్ కూడా అచ్చం ఇలాగే..!
కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చేస్తుందంటూ విమర్శిస్తున్న జగన్ సైతం పలుమార్లు అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులను, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని.. గతేడాది మే 9న తాడేపల్లిలో జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో అన్నారు. వారు సప్త సముద్రాలు అవతల ఉన్నా.. రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తప్పకుండా సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత పలు వేదికలపై సైతం జగన్ ఈ తరహా వ్యాఖ్యలే చేసి అధికారులను హెచ్చరించడం గమనార్హం.
Also Read: Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
నలిగిపోతున్న అధికారులు..
దర్యాప్తు వ్యవస్థలు, పోలీసులను అధికార పార్టీలు.. పావులుగా ఉపయోగించుకుంటున్నాయన్న విమర్శలు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ.. తన అధికార బలాన్ని ఉపయోగించుకొని.. విపక్ష నేతలను అణిచివేస్తుండటం గత కొంతకాలంగా రాజకీయాల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో చంద్రబాబు (CM Chandrababu) జైలుకు వెళ్లడం, ఇటు తెలంగాణలో కేసీఆర్ (KCR) పాలనలో రేవంత్ రెడ్డి కూడా కటకటాల పాలు కావడం అందరికీ తెలిసిందే. గతంలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు అవలంభించిన ధోరణినే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అవలంభిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తమపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వాలని వదిలేసి.. విపక్ష పార్టీలు తమపై పడిపోవడంపై కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అధికార, విపక్ష పార్టీల మధ్య తాము నలిగిపోతున్నట్లు వాపోతున్నారు.

