Nitin Nabin Sinha: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన యువనేత, నితిన్ నబీన్ సిన్హా పేరు ఖరారైంది. సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన నామినేషన్ల ప్రక్రియతో ఆయన ఎన్నిక ఇక లాంఛనంగా మారింది. పార్టీ పగ్గాలను ఒక యువ నాయకుడికి అప్పగించాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేశారు. వేరే ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అనూహ్యంగా నితిన్ నబీన్ పేరు తెరపైకి
జాతీయ అధ్యక్ష రేసులో పలువురు సీనియర్ నేతలు, కేంద్ర మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అధిష్టానం మాత్రం అనూహ్యంగా నితిన్ నబీన్ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో పదవి దక్కుతుందని ఆశించిన వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత నితిన్ నబీన్ సిన్హా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలపనున్నారు.
Also Read: Chiranjeevi MSG: మన ప్రసాద్ గారు ఫస్ట్ వీకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారోచ్.. వివరాలివే!
ఆశావహుల ఆశలపై నీళ్లు
దేశంలోని మొత్తం 36 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాలకు అధ్యక్ష ఎన్నిక తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు కనీసం 50 శాతం రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంది. అవసరమైన దాని కన్నా చాలా ఎక్కువ రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈనెల 16న ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడింది, ఓటర్ల జాబితా ప్రచురితమైంది. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. నితిన్ నబీన్ కు సంబంధించిన నామినేషన్ల సెట్ మాత్రమే రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలా ఉండగా జాతీయ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు బలంగా వినిపించాయి. కానీ, పార్టీ అనూహ్యంగా రేసులో లేని పేరును తెరపైకి తీసుకురావడంతో పదవి తమకే వస్తుందని భావించిన వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఎవరీ నితిన్ నబీన్?
బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా నితిన్ నబీన్ ఎదిగారు. గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు ఉంది. దానికి తోడు 45 ఏళ్ల నితిన్ నబీన్ బీజేపీ చరిత్రలోనే జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. డిసెంబర్ 2025 నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాబోయే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీని బలోపేతం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు. జేపీ నడ్డా వారసుడిగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల దిశగా పార్టీని సమాయత్తం చేసే గురుతర బాధ్యత ఇప్పుడు ఆయన భుజస్కంధాలపై ఉంది.
Also Read: MP Chamal Kiran: దావోస్ ‘వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్’ వేదికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

