Gaddelu Controversy: రాజకీయాల్లో పార్టీల అస్థిత్వాన్ని ప్రతిబింబించే వాటిలో తొలిస్థానంలో విగ్రహాలు ఉండగా.. రెండో స్థానంలో గద్దెలు లేదా దిమ్మెలు నిలుస్తుంటాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా తమకు బలమున్న ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఈ గద్దెలను ఏర్పాటు చేసి.. వాటిపై తమ జెండాలను ఎగురవేస్తుంటాయి. అయితే ఈ గద్దెలే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారాయి. వీటి కేంద్రంగా అధికార కాంగ్రెస్ తో పాటు, బీఆర్ఎస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల శ్రేణులు.. ఒకరినొకరు విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ గద్దెల కేంద్రంగా వివాదం ఎలా మెుదలైంది? కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) శ్రేణుల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరుగుతోంది? ఇప్పుడు చూద్దాం.
వివాదం ఏంటంటే?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు మరింత పేలుతున్నాయి. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. బీఆర్ఎస్ గద్దెల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ (TDP) ఉండొద్దని ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ పార్టీని, దాని అధినేత కేసీఆర్ (KCR) ను 100 మీటర్ల గొయ్యి తీసి బొందపెట్టాలని అన్నారు. అంతేకాకుండా ఊళ్లల్లో ఆ పార్టీ దిమ్మెలను కూల్చాలని పిలుపునిచ్చారు. అప్పుడే నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao), వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)కి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. వాటిని కూల్చి కాంగ్రెస్ జెండాను ఎగురువేయాలన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య అగ్గి రాజేశాయి.
మీ గద్దె కూలుతుంది జాగ్రత్త
బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం (జనవరి 19) తీవ్రంగా తప్పుబట్టారు. ‘మా గద్దెల జోలికి వస్తే.. మీ గద్దె కూలుతుంది జాగ్రత్త’ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ‘దుమ్ము దుమ్ము అయిపోతావ్ బిడ్డ’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ పార్టీ గద్దెల్లో లేదన్న హరీశ్ రావు.. ప్రజల గుండెల్లో ఉందంటూ చెప్పుకొచ్చారు. గద్దెలు కూలిస్తే పోయే పార్టీ బీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమైనవన్న ఆయన.. ప్రతిపక్ష పార్టీని భౌతికంగా కూల్చాలన్న సంకేతాలు ప్రమాదకరమన్నారు. అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని, బీఆర్ఎస్ ను భయపెట్టే ప్రయత్నమని ఆరోపించారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జులుగా.. తెలంగాణ మంత్రులు.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే!
సోషల్ మీడియాలో బిగ్ ఫైట్..!
సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు సైతం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏ ఊరిలోని బీఆర్ఎస్ గద్దెలను కూలుస్తారో చెప్పాలని పట్టుబడుతున్నారు. తరతరాలుగా అణిచివేయబడ్డ తెలంగాణ గోసను చెరిపేసినందుకే బీఆర్ఎస్ గద్దెను కూల్చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పరాయి పాలన సంకెళ్లను తెంచి ఆత్మగౌరవపు పతాకాన్ని ఎగరేసినందుకు కూల్చాలా? అంటూ నిలదీస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం దీటుగా సమాధానమిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ చేసిందేమి లేదని మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించి.. బీఆర్ఎస్ గద్దెలను ప్రజలే కూలగొట్టారని కౌంటర్లు వేస్తున్నారు. మెుత్తంగా ఈ గద్దెల వివాదం ప్రస్తుతం అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసిందని చెప్పవచ్చు.

