PhonePe Fake Links: సైబర్ క్రిమినల్స్ జనాన్ని మోసం చెయ్యటానికి ఏ అవకాశాన్ని కూడా వదలటం లేదు. తాజాగా ‘ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్’ పేర వల విసురుతున్నారు. పండుగ ముగిసినా సంక్రాతి కానుక అంటూ మోసాలకు శ్రీకారం చుట్టారు. 5వేలు దక్కించుకోండి అని ఊరిస్తూ లింకులు పంపిస్తున్నారు. ఇలాంటి లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
సబ్బు కొంటే టూత్ బ్రష్ ఉచితం అన్న ఆఫర్ కనిపిస్తే అవసరం లేకున్నా కొనేవాళ్లు ఎంతోమంది ఉంటారు. సరిగ్గా మనుషుల్లోని ఈ ఆశను పెట్టుబడిగా చేసుకుంటూ సైబర్ కేటుగాళ్లు ‘నకిలీ అనుకున్నా.. 5వేలు వచ్చాయి.. మీరూ ప్రయత్నించండి’ అన్న మెసేజ్ తో లింకులను షేర్ చేస్తున్నారు. తెలిసిన వారి నుంచి లేదా గ్రూపుల నుంచి ఇలాంటి మెసేజ్ లు వచ్చినా నమ్మవద్దని సీపీ సూచించారు. ఇలాంటి మెసేజ్ ల చివర http://fdgc.lusvv.xyz, http://iom.qmtyw.xyz వంటి వింత అక్షరాలు ఉంటాయని తెలిపారు. అవి ఫోన్ పే అధికారిక లింకులు కావని తెలిపారు.
Also Read: Lucky Draw Scam: నిన్న బెట్టింగ్ యాప్స్.. నేడు లక్కీ డ్రా.. ఆశపడ్డారో జేబులు గుల్లే!
ఒకవేళ ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే ఫోన్‌లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశిస్తుందని సజ్జనార్ చెప్పారు. ఆ వెంటనే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ పిన్ నెంబర్లు, పాస్ వర్డులు సైబర్ క్రిమినల్స్ కు తెలిసి పోతాయన్నారు. ఆ వెంటనే కేటుగాళ్లు బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తారని తెలిపారు. ఫోన్ పే, గూగుల్ తోపాటు ఇతర ఏ సంస్థ కూడా వాట్స్ అప్ లింకుల ద్వారా డబ్బులు పంపించవని చెప్పారు. ఏ ఆఫర్ ఉన్నా అది వారి అధికారిక యాప్ లో కనిపిస్తుందని తెలిపారు. పొరపాటున ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే మొదటి గంటలోపు 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలన్నారు. దాంతోపాటు http://cybercrime.gov.in కు కంప్లైంట్ చేయవచ్చని సజ్జనార్ సూచించారు.
ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు.. జాగ్రత్త!
సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్లో "PhonePe రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్", "సంక్రాంతి కానుక" అంటూ కొన్ని నకిలీ లింకులు విపరీతంగా చక్కర్లు… pic.twitter.com/2it2bhKszG
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 18, 2026

