AP News: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ‘భారతరత్న’ అవార్డ్ దక్కాలన్నది దశాబ్దాల కల. తెలుగు నేలపైనే కాకుండా, జాతీయ రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్‌కు ఈ పురస్కారం ప్రకటిస్తే సముచితంగా ఉంటుందన్న అభిప్రాయాలు అన్ని వర్గాల నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్రం ప్రకటన చేయడమే తరువాయి అంటూ గతంలో జోరుగా ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, ప్రచారం వరకే పరిమితమయ్యాయి. ఇవాళ (జనవరి 18) వర్థంతి సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ డిమాండ్‌పై సరికొత్త ఆశలు రేకెత్తించేలా (AP News) అనిపిస్తున్నాయి.
చంద్రబాబు ఏమన్నారంటే?
‘‘ఎన్టీ రామారావుకు భారతరత్న అవార్డ్ ఇవ్వాలి. ఎందుకంటే, ఈ దేశంలో నీతి, నిజాయితీతో రాజకీయాలు చేసిన వ్యక్తి. జాతి కోసం పని చేసిన వ్యక్తి ఆయన. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఐకమత్యం తీసుకొచ్చేందుకు పనిచేశారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం. తెలుగువారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామనే నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. మీ (టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి) మనోభావాలు నాకు చాలా ముఖ్యం. అది సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాధిస్తాం’’ అని చంద్రబాబు చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
చంద్రబాబు మాటల్లో నమ్మకం!
‘‘ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తాం. సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి. గతంలో ఎన్నోసార్లు ఈ డిమాండ్ వినిపించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అవినాభావ సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాఖ్యలకు ఉన్న ప్రాధాన్యత వేరుగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ కూడా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ పట్ల తన గౌరవాన్ని చాటిచెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చంద్రబాబు నమ్మకంతో మాట్లాడినట్టుగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వాలి?
ఎన్టీఆర్‌ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడలేం. దేశంలో సామాజిక భద్రతా పథకాల అమలులో ఒక టార్చ్‌బేరర్‌గా నిలిచారు. కేవలం రెండు రూపాయలకే కేజీ అందించి పేదవాడి ఆకలి తీర్చిన సంస్కర్తగా ఆయనకు పేరుంది. ఆస్తిలో ఆడబిడ్డలకు కూడా సమాన హక్కు కల్పించే చట్టం తీసుకొచ్చి ఒక దార్శనికుడిగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం విషయంలోనూ ఆయన ట్రెండ్ సెట్టర్. కాబట్టి, ఆయనకు పురస్కారం లభిస్తే తెలుగువారే జాతీయ రాజకీయ వర్గాలు కూడా హర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం రూ.100 నాణేన్ని విడుదలకు పరిమితమైంది. ఇది ఒక రకమైన సానుకూల సంకేతమని, అదే స్ఫూర్తితో భారతరత్న ప్రకటన కూడా త్వరలోనే బావుంటుందనే ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ఈ కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.

