Republic Day Alert: గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలను హెచ్చరించాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు హింసకు పాల్పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పహల్గాం నరమేధం తరువాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ జరిపింది. ఇందులో భాగంగా మన వైమానిక బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంట్లో ప్రధానంగా జైష్ ఏ మొహమ్మద్ ఉగ్ర సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఆ సంస్థ ఛీఫ్ మొహమ్మద్ అజహర్ మసూద్ సోదరుడితోపాటు పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Minister Komatireddy: నన్ను ఏమైనా అనండి.. మహిళా అధికారిపై రాతలు బాధాకరం.. నోరువిప్పిన మంత్రి కోమటి
అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న అజహర్ మసూద్ మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్పింగ్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక జైష్ ఏ మొహమ్మద్ సంస్థ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం డ్రోన్ల ద్వారా మన దేశంలోకి ఆయుధాలను చేరవేసే ప్రయత్నం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశాలు
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వారిలో కొందరితోపాటు, ఖలీస్తాన్ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి. అదే సమయంలో జైష్ ఏ మెహమ్మద్ తోపాటు ఇతర ఉగ్ర సంస్థల తరపున పని చేస్తున్న స్లీపర్ సెల్స్ నుంచి ముప్పు పొంచి ఉన్నదని పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ కారు బాంబు పేలుడు ఉదంతం స్లీపర్ సెల్స్ నుంచి ఉన్న ప్రమాదాన్ని స్పష్టం చేస్తున్నదని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా అలసత్వానికి చోటు ఇవ్వొద్దని హెచ్చరించాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కన్నేసి పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కూడా నిఘా వేశారు. కీలక ప్రాంతాలను నో ఫ్లైయింగ్ జోన్లుగా ప్రకటించనున్నారు.

